ప్రజాశక్తి-ఒంగోలు: ప్రముఖ కవయిత్రి, తెలుగు ఉపాధ్యాయిని గంగవరపు సునీతకు మహాకవి గుర్రం జాషువా జీవిత సాఫల్య పురస్కారం-2024 లభించింది. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని జాషువా ప్రాంగణంలో గుర్రం జాషువా 129వ జయంతి కార్యక్రమం జరిగింది. సభకు గుర్రం జాషువా సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ.. ఆమెకు సమితి తరఫున గుర్రం జాషువా జీవిత సాఫల్య పురస్కారం-2024ను అందజేశారు. ఆమె ఈ పురస్కారానికి ఎంపిక కావడం అభినందనీయమని జెసి కొనియాడారు. సునీత రాసిన ‘మరో గబ్బిలం’ పుస్తకాన్ని జెసితో పాటు నిర్వాహకులు, ఆహూతులు ఆవిష్కరించారు. అనంతరం సునీతను మెమెంటో, శాలువా, పూలదండతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సిహెచ్ సుధాకర్‌బాబు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ సురేష్, కవి కత్తి కళ్యాణ్, ఎంఆర్‌పిఎస్ నాయకులు రావినూతల కోటి మాదిగ, పానుగంటి షాలేమురాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
