‘ఓరుగంటి’ ప్రజల పక్షం: జంకె

ప్రజాశక్తి-మార్కాపురం : స్వాతంత్య్ర సమర యోధుడు, సీనియర్‌ పాత్రికేయులు స్వర్గీయ ఓరుగంటి వేంకట రమణయ్య ప్రజల పక్షాన నిలిచారని మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కొనియాడారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఓరుగంటి వేంకట రమణయ్య 35వ వర్థంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో తొలితరం పాత్రికేయుడు కూడా ఓరుగంటి మాత్రమేనన్నారు. అప్పట్లో దేశం కోసం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. పాత్రికేయ రంగంలో జనం కోసం పనిచేశారన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా పరిష్కరించాలనే తపనతో కథనాలు వెలువడేవన్నారు. నేటి తరం మీడియా ప్రతినిధులు ఓరుగంటి వేంకట రమణయ్యను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ముందుగా ఓరుగంటి వేంకట రమణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు దొండపాటి మోహన్‌రెడ్డి, ఎపియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు నూకని వెంకటరమణ, ఇతర ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️