జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద నివాళుర్పిస్తున్న కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి-గుంటూరు : ఆనాటి సమాజంలో అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ కొనియాడారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే 134 వర్థంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ ట్రావెలర్ బంగ్లా ఆవరణలోని విగ్రహానికి కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్‌ప్సన్ కత్తెర హెనీక్రిస్టీనా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, నగర కమిషనర్ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఒ ఖాజావలి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మహిళా విద్య కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, 1848లోనే ఆయన తన భార్య సావిత్రిబాయిపూలే కుటుంబంలోని మహిళలను విద్యావంతులను చేయటంతోపాటు, మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ప్రారంభించారని చెప్పారు. మహిళా విద్యకోసం ఆనాడు మహాత్మ జ్యోతిబాపూలే చేసిన కృషివల్ల నేడు మహిళలకు విద్యాహక్కు వచ్చిందని, దీనికి పూలే దంపతులకు మహిళలందరూ రుణపడి ఉండాలని అన్నారు. ఆ మహానీయుని ఆశయాల స్ఫూర్తితో నేటి సమాజంలో యువత ముందుకు వెళ్లాలన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం సామాజిక, మహిళా చైతన్యం, విద్య కోసం పూలే విశేషమైన కృషి చేశారన్నారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలుకు కులగణన జరగాలని, దేశంలో 1931లో మాత్రమే కుల గణన జరిగిందని, కులగణన జరిగితే జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కేంద్రప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ సామాజిక సంఘ సంస్కర్తగా, మహిళలకు విద్యా అవకాశాలు, వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించిన మహనుభావుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ పూలే కృషి ఫలితంగా నేడు తమలాంటి మహిళలు విద్యావంతులై, ఉన్నత పదవులు అధిరోహించటం సాధ్యమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయరు సజీలా తదితరులు పాల్గొన్నారు.