పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబును ఎస్పీ శ్రీనివాసరావు కలెక్టర్‌ ఛాంబర్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ … చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు తాను రావడం సంతోషమన్నారు. ఎలక్షన్‌ జరిగినప్పటి నుండి పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయని, గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్ధవంతంగా పరిష్కారించారని తెలిపారు. తాను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో తప్పుడు కేసులు బనాయించకుండా చూసుకునేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యాంటీ డ్రగ్స్‌ పై జిల్లాలో 100 రోజులు క్యాంపెన్‌ చేస్తామన్నారు. గంజాయి విక్రయాలు జరగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. ఇల్లిగల్‌ యాక్టివిటీ జరిగితే వాటిని ఆధారాలతో అవసరమైతే ఇతర శాఖలతో కలిసి ముందు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏ సమస్యలు ఉన్నా ప్రజలు తమ వద్దకు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రజలు అనవసరమైన ఘర్షణలకు పాల్పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని సూచించారు. పల్నాడు పోలీసులు ప్రజల సేవల కోసం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

➡️