ప్రజాశక్తి – కడప కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) అండర్ -12 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం వైఎస్ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కర్నూలు జట్టుపై ఆరు వికెట్ల తేడాతో కడప జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 34.3 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిషిత్ 48, రేవంత్ 25 పరుగులు చేశారు. కడప జట్టులోని రుత్విక్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 140 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కడప జట్టు 26.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కడప జట్టులోని తాహిర్ 57 (నాటౌట్) పరుగులు చేశారు.నెల్లూరుపై అనంతపురం జట్టు విజయం కెఒఆర్‌ఎం క్రికెట్ మైదానంలో నిర్వహించిన వేరొక మ్యాచ్‌లో నెల్లూరు జట్టుపై 75 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 35.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ జట్టులోని హవిష్ 51, గణేష్ 45 పరుగులు చేశారు. అనంతరం 196 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెల్లూరు జట్టు 34.1 ఓవర్లలో 120 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. అనంతపురం జట్టులోని ఉత్తేజ్ యాదవ్ 5 వికెట్లు తీసుకున్నాడు.