‘గడప గడపకు’లో టిడిపి, వైసిపి కార్యకర్తల ఘర్షణ

జెండాల విషయంలో ఒకరిపైనొకరు దాడులు
వైసిపికి కార్యకర్తకు గాయాలు
ప్రజాశక్తి – ఎర్రగుంట్ల
మండల పరిధిలోని దండుపల్లిలో ఆదివారం వైసిపి శ్రేణులు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాలు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గడపగడపకు కార్యక్రమానికి దండుపల్లికి వెళ్తున్న నేపథ్యంలో అప్పటికే ఆగ్రామంలోని విద్యుత్‌ స్తంభాలకు కట్టిన టిడిపి జెండాలను తొలగించి వాటి స్థానంలో వైసిపి జెండాలను కట్టారు. గమనించి టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని చివరకు దాడులు పాల్పడే స్థాయికి చేరింది. ఈ సంఘటనలో వైసిపికి చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు టిడిపి కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తరువాత అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో ఎర్రగుంట్ల పట్టణంలోని టిడిపి కార్యాలయంపై వైసిపి కార్యకర్తలు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న భూపేష్‌రెడ్డి టిడిపి కార్యాలయానికి బయలు దేరారు. పోలీసులు ఆయన్ను ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు వద్ద ఆపారు. పోలీసులు టిడిపి కార్యాలయానికి చేరుకుని వైసిపి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపైనొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫోటో : టిడిపి కార్యాలయం పై దాడికి యత్నించిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

➡️