విద్యుత్‌ కోతలు నివారించాలి : ఎపి రైతు సంఘం

ప్రజాశక్తి -చింతకొమ్మదిన్నె విద్యుత్‌ కోతలను నివారించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసిధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉద్యానవన పంటలు అరటి, ఆకుతోటలు చీనీ, బొప్పాయి, నువ్వు , వేరుశనగ పంటలు బోర్ల కింద సాగు చేశారని తెలిపారు. కరెంటు కోతలతో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. 9 గంటలు సరఫరా అవుతున్న విద్యుత్‌ను ప్రస్తుతం ఏడు గంటలకు కుదించారని వాపోయారు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరెంటు కోతలపై మండల విద్యుత్‌ శాఖ అధికారులకు ఫోన్‌ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, తెలిపారు. మండలాన్ని ప్రత్యేక దష్టిలో ఉంచుకొని తొమ్మిది గంటలు కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆయన కోరారు. కరెంటు కోతలను నివారించకపోతే రాబోవు కాలంలో ఆందోళన పోరాటాలకు శ్రీకారం చెబుతామని హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, నాయకులు చిన్న సిద్దయ్య, హరి, బంకు సిద్ధయ్య, రమణ పాల్గొన్నారు.

➡️