12వ పిఆర్‌సి అమలు చేయాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌
12వ పిఆర్‌సిని తక్షణం అమలు చేయాలని, అమలయ్యే వరకు 30 శాతం మధ్యంతర భతి ఇవ్వాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్‌, పాలెం మహేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం యుటిఎఫ్‌ భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2023 జులై ఒకటవ తేదీ నుంచి 12వ పిఆర్‌సిని అమలు చేయాల్సినప్పటికీ అమలు చేయడంలో పాలకులు వైఫల్యం చెందారన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల 11వ పిఆర్‌సిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పూర్తిగా నష్టపోయారన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పిఆర్‌సి కమిషన్‌ ను నియమించినప్పటికీ, అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదన్నారు. అమలు జాప్యం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గత ప్రభుత్వం నియమించిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగినందున పిఆర్‌సి అమలులో మరింత జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాప్యాన్ని నివారించేందుకు తక్షణమే దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భ తిని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యంతర భతిని అమలు చేయడంతో పాటు పిఆర్సి నూతన కమిషన్‌ నియామకం చేపట్టాలని కోరారు. ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా గత పిఆర్‌సిలో జరిగిన నష్టాన్ని దష్టిలో పెట్టుకుని మెరుగైన ఫిట్మెంట్‌ను ప్రకటించాలని కోరారు. దీంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌ రుణాలు, ఎపిజిఎల్‌ఐ రుణాలు, తుది చెల్లింపులు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు, గత పిఆర్‌సి బకాయిలతో పాటు, డిఎ బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డిఎలను దసరా కానుకగా విడుదల చేయాలని కోరారు. ఈనెల 10న నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా ట్రెజరర్‌ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శి సి.వి.రమణ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌ పాల్గొన్నారు.

➡️