ఇంటి పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి

భూ కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామ్మోహన్‌
ప్రజాశక్తి-కడప అర్బన్‌
నగరంలోని 15వ డివిజన్‌ సరోజినీ నగర్‌ దగ్గర ఉన్న ఆచార్య కాలనీలో ఇంటి పట్టాలు, ఇళ్ల స్థలాలను భూకబ్జాదారులు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని, తక్షణమే తహశీల్దార్‌ సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామ్మోహన్‌ కోరారు. బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య కాలనీలో 30 ఏళ్ల కిందట బడుగు, బలహీన వర్గాలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి, క్రిస్టియన్‌ మైనార్టీలకి, ఇళ్ల స్థలాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని కొంతమంది బినామీ పేర్లతో దొంగ పట్టాలు సష్టించి అమ్ముకుంటున్నారని తెలిపారు. దీనిపై మండల తహశీల్దార్‌, రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేసి భూ కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులకు వత్తాసు పలకడంతో గతంలో ఇక్కడ పనిచేసిన తహశీల్దార్‌ పేరుతో దొంగ పట్టాలు సష్టించి ఆచార్య కాలనీలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన కొంతమందికి పట్టా స్థలాలు ఉన్నా కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు భూ కబ్జాదారులతో చేతులు కలిపి దాడులకు, దౌర్జన్యాలకు బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే తహశీల్దార్‌ విచారించి ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆచారి కాలనీ భూ కబ్జా దారులపై సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన, పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, నగర నాయకులు గోవిందు, నరసింహ పాల్గొన్నారు.

➡️