ఫ్రజాశక్తి – కడప సిటీ
బిసిల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, బిసిల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కడప రిమ్స్‌లోని బిసి భవన్‌లో నిర్వహించిన డాక్టర్ బత్తల స్రవంతి అభినందన సత్కార సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్రవంతి అభినందన కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బిసిల సంక్షేమం కోసం మహాత్మ జ్యోతిరావు పూలే ,సావిత్రిబాయి పూలే మొదలగు సంఘసంస్కర్తలు ఎంతో కషి చేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిసిల సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని చెప్పారు. బిసిలకు సామాజిక రక్షణ చట్టం తెచ్చేందుకు ఉత్తర్వులు ఇస్తారన్నారు. బిసి భవన్‌కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ నిధుల నుండి రూ. 20 లక్షలు కేటాయిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ నిధులతో బిసి భవన్‌కు భవన్‌కు సకల సౌకర్యాలు చేకూరుస్తామని ఆ నిధులు చాలక పోతే వ్యక్తిగతంగా తాను కూడా సహకరిస్తానని అన్నారు. బిసిలకు ఏ సమస్య వచ్చినా తనను కలుసుకొని పరిష్కరించుకోవాలని అన్నారు. సభా అధ్యక్షులు భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ డాక్టర్ బత్తల స్రవంతి అంతర్జాతీయ ఆర్థోపెడిక్ మహిళా సర్జన్ గా 2024వ సంవత్సరానికి అవార్డు అందుకోవడం అభినం దనీయమన్నారు. ఈ సందర్భంగా స్రవంతికి ఆమె తల్లిదండ్రులు బత్తల లింగమూర్తి, సుజాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు తొలుత అంబేద్కర్ జయ ంతి సందర్భంగా అంబేద్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలువేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం బిసి భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు శిష్యుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను పద్యరత్నముల జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు బత్తల లింగమూర్తి, గోవిందు నాగరాజు,పత్తూరు గురుస్వామి, బుర్ర రామాంజనేయులు, ఎం త్రివిక్రమ్ యాదవ్, ఎం శ్రీనివాసులు, తెలుగు లెక్చరర్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భూమిరెడ్డి రవి కళ్యాణ్, రామ్మూర్తి నాయుడు, అంజి, నగేష్ పాల్గొన్నారు.
