ప్రజాశక్తి – కడప ప్రతినిధి
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు లిఫ్ట్ పనులు టెండరు దశను దాటలేదు. 2021లో జిల్లా జలవనరుల శాఖ రూ.90 కోట్లతో కూడిన వెలిగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండరు పిలి చింది. నార్-పోయా కాంట్రాక్టు సంస్థ లు సంయుక్తంగా టెండరును దక్కిం చుకున్నాయి. అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. టెండరు అగ్రిమెంట్ ప్రకారం జలనవరుల శాఖ 34 ఎకరాల భూసేకరణ చేసి భూములు అప్పగించాల్సి ఉంది. జిల్లా జలవనరులశాఖ 34 ఎకరాలను సర్వే చేసి, అర్హులైన రైతులను సైతం గుర్తించింది. ప్రభుత్వ భూమి ఆరు ఎకరాలు, ఫారెస్టు భూమి రెండు ఎకరాల, మిగిలిన 24 ఎకరాలు డికెటి, ఇతర పట్టా భూములు ఉన్నట్లు తేల్చింది. రూ.6 కోట్లు పరిహారానికి నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. భూములు కోల్పోతున్న రైతులకు నాలుగేళ్లుగా పరిహారం నిధులు విడుదల చేసిన పాపాన పోలేదు. ఫలితంగా సదరు కాంట్రాక్టు సంస్థలు ఎత్తిపోతల పనులు చేపట్టడం సాధ్యంకాదని తేల్చిచెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎత్తిపోతల పనుల కాంట్రాక్టును క్లోజ్ చేయాలని కోరుతూ జలవనరుల శాఖను కోరింది. జిల్లా జలవనరుల శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.2024 డిసెంబర్‌లో కాంట్రాక్టును రద్దు చేసినట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ అసమర్థ నిర్వాకం ఏటా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న గాలివీడు మండల రైతాంగం ఆశలపై నీళ్లు చల్లడం తీవ్ర నిరాశను కలిగించింది. దీనిపై వెలిగల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సంప్రదించగా వెలిగల్లు ఎత్తిపోతల పనులను రద్దు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించడం గమనార్హం. పరిహారం నిధుల ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.
