ఫిర్యాదుల్లేని సేవలే లక్ష్యం

ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా విద్యుత్‌ ఎస్‌ఇ ఎస్‌. రమణ
ప్రజాశక్తి-సుండుపల్లి
ఫిర్యాదులు లేని సేవలే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా విద్యుత్‌ ఎస్‌ఇ ఎస్‌. రమణ పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని సానిపాయ 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను, ట్రాన్స్‌ఫార్మర్లను, లైన్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. ఈ సానిపాయ రైతులు తమ విద్యుత్‌ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశాఇంచారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ఎస్‌ఇ మాట్లాడుతూ ప్రకతి వైపరీత్యాల వల్ల లైన్లు తెగిపడే అవకాశాలున్నాయని, తగు జాగత్త్రలు తీసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కూడా వృథా కారాదని సూచించారు. సర్వీస్‌ పొందిన మీటర్‌ ద్వారానే విద్యుత్‌ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలని, వాలిపోయిన స్తంభాలను, లూజు లైన్లను ఎప్పటికప్పుడూ సరిచేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. తక్కువ ఎత్తులో ఉన్న లైన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థ నెలరోజుల ముందు విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు ఇస్తుందని, విద్యుత్‌ బకాయిల వసూళ్లలో రాజీ వద్దు, వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూ విద్యుత్‌ ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్షేత్రస్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలని తెలిపారు. వినియోగదారుల విద్యుత్‌ సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని ఆదేశించారు. లైన్లలో తిరిగి సమస్యలను గుర్తించి ముందస్తు మరమ్మతులు చేసి అంతరాయలను అరికట్టి నాణ్యమైన విద్యుత్‌ అందించాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారునితో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి విద్యుత్‌ సమస్యలను సావధానంగా విని పరిష్కరించి సంస్థపై ప్రజలలో సంతప్తికరస్తాయిని పెంచాలని తెలియజేశారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. సమావేశంలో రాయచోటి ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చాంద్‌బాషా, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️