కేరళ పట్ల కేంద్ర బిజెపి వివక్షను ఖండించండి

Dec 11,2024 13:20 #Kadapa district

సంఘీభావంగా ప్రజాసంఘాల ధర్నా
ప్రజాశక్తి-కడప అర్బన్ : కేరళ పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ చర్యలు ఖండించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలో సిపియం నాయకత్వాన ఉన్న వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు కల్పింస్తున్న దని, చట్టపరంగా రావాల్సిన నిధులు విడుదల చేయలేదని అందుకు నిరసనగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేరళ ప్రభుత్వానికి సంఘీభావంగా కడప అంబేద్కర్ సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్, దస్తగిరి రెడ్డి, అన్వేష్, శ్రీనివాసులు రెడ్డి, గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ…. గవర్నర్ ను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్నారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తి విఘాతం కల్పిస్తున్నదన్నారు. అత్యంత బలీయమైన సహకార రంగం ఉన్న కేరళ రాష్ట్రంలో ఈ రంగాన్ని నాశనం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భారత పెట్రోలియం లాంటి భారీ పరిశ్రమలను అమ్మడానికి పూనుకుందని విమర్శించారు. దీనిపై కేరళలో సంవత్సరం పైగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిందని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. త్రివేండ్రం విమానాశ్రయాన్ని అదానికి అప్పగించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే కొంటామన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి నిరాకరించిందని పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వయనాడ్ కొండ చర్యలు విరిగిపడి నాలుగు వందల మంది మరణించారని పేర్కొన్నారు. మరో వంద మంది నేటికీ లభ్యం కాలేదని చెప్పారు. ఇటువంటి తీవ్రమైన దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కేరళ పట్ల వివక్ష తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండించాలని కోరుతున్నామన్నారు. కేరళ రాష్ట్రం దేశంలోనే అక్షరాస్యతలో అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం వామపక్షాలు అధికారంలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడి ప్రజల చైతన్యం మెండు, రాష్ట్రంలోని పరిమిత వనరులతోనే సర్వతోముఖాభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. కేరళలో కనీస వేతనం రోజుకు రూ.600 కానీ, అత్యధిక కార్మికులు రోజుకు రూ.1000కి పైగా వేతనం పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 30 రకాల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. 13 రకాల నిత్యావసర సరుకులు ప్రజలకు అతి తక్కువ ధరకు అందిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ కాలంతో సహా పిల్లలకు విద్యను అందించడంలో దేశంలోనే అగ్ర భాగంలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత గృహం వామపక్ష పార్టీల కాలంలో ఏర్పాటు చేశారని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను కూడా “అతిధి”గా భావించి వారికి రాష్ట్రంలోని ఇతర ప్రజల్లాగా అన్ని వసతులు సమకూర్చారని పేర్కొన్నారు. రైతులకు దేశంలోనే అత్యధిక గిట్టుబాటు ధరను అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలు విరమించి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామ్మోహన్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసయ్య, రమణ, సురేష్, సిఐటియు నాయకులు గోవిందు, యువజన విద్యార్థి సంఘం నాయకులు విజయ్, రవి పాల్గొన్నారు.

➡️