ప్రజాశక్తి – వేంపల్లె : వేంపల్లెలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న అమ్మ అనాథ వృద్ధుల శరణాలయంలోని వృద్ధులకు బట్టలు పంపిణీ చేపట్టారు. బుధవారం కడప నగరంలోని ఆక్కాయపల్లెకు చెందిన కాంట్రాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈనేపథ్యంలో దాత కుమారుడైన వడ్డేమాని పవన్ భార్గవ్ రెడ్డి 11వర్థంతిని పురస్కరించుకుని అనాథ వృద్ధులు అందరికి బట్టలను కుటుంబ సభ్యులు అందజేశారు. ప్రతి ఎడాది అమ్మ అనాథ వృద్ధుల శరణాలయంలో ఉన్న వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు బట్టలను కూడ పంపిణీ చేస్తున్నట్లు దాత రామలింగారెడ్డి తెలిపారు. తన కుమారుడు పేరు మీద అనాథ వృద్ధులను ఆదుకొనేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అనాథ వృద్ధులకు చేయూత ఇవ్వడం సంతోషకంగా ఉందని తెలిపారు. బట్టలు పంపిణీ అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులైన లక్ష్మిదేవి, రాజారాజేశ్వరి, వెంకట సుబ్బారెడ్డి, అరుణ, విఆర్ఓ రాఘవేంద్రరెడ్డి, ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.