అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చేయరాదు : డిఆర్‌ఒ

ప్రజాశక్తి – కడప
ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్‌ఎస్‌) లో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలని అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. తొలుత పిజిఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి, జడ్‌పి సిఇఒ ఓబులమ్మ పిజిఆర్‌ఎస్‌ దరకాస్తు లపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. కడప మండలం, సరోజ నగర్‌కు చెందిన దేవదానం ఇంటి స్థలం మంజూరు చేయాలని అభ్యర్తించారు. బద్వేలు మండలం చెన్నంపల్లి మిట్ట ప్రగతి నగర్‌కు చెందిన తుడుము వెంకటయ్య తన కుమారునికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమలాపురం మండల కేంద్రానికి చెందిన జూటూరు రాధామని కమలాపురం-కాజీపేట రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి భవనాలు పాడయ్యాయని నష్టపరిహారం ఇవ్వాలని అభ్యర్తించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌నాయక్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, ఎస్‌డిసి వెంకటపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️