విదేశీ బీమా కంపెనీలు దేశ భద్రతకు ముప్పు

ప్రజాశక్తి – కడప అర్బన్‌
విదేశీ కంపెనీలు దేశ భద్రతకు, ప్రజల సమాచార గోప్యతకు ముప్పు అని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం కడప డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. దేశవ్యాప్త పిలుపుమేరకు డివిజన్‌ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం డివిజనల్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన మేరకు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం తగదన్నారు. రెండు రోజుల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విదేశీ ఇన్సూరెన్స్‌ కంపెనీలను నేరుగా ఆహ్వానించడంతో బీమారంగానికి, పాలసీదారులకు మేలు చేయదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు బీమా రక్షణను విస్తరింపజేసి పాలసీదారులకు సకాలంలో చెల్లింపులు చేస్తూ దేశాభివద్ధికి నిధులను అందిస్తున్న ఎల్‌ఐసికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సి ఉండగా, కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని అన్నారు. పార్లమెంటులో ఎఫ్‌డిఐని పెంచుతూ బీమ చట్ట సవరణ బిల్లు తీసుకువస్తే సమ్మె కైనా వెనుకాడ బోమని హెచ్చరించారు. అలాగే పాలసీ ప్రీమియాల మీద కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్‌టిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్ల నేతలు సుధీకర్‌, నిత్యానంద రెడ్డి, అక్బర్‌ బాషా, వసుప్రద, వారిజాతమ్మ, రత్నకిషోర్‌, జె.రఘు శ్రీనివాస్‌ కుమార్‌, జయచంద్ర, అప్పయ్య, చిన్నయ్య, శ్రీనివాససులు, యల్లయ్య,ఉద్యోగులు, పెన్షనర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు.నిరసనలో మాట్లాడుతున్న రఘునాథరెడ్డిబీమారంగంలో ఎఫ్‌డిఐలను వ్యతిరేకించండి బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డిఐ, విదేశీ బీమాను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లు – 2024ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ సవరణలతో దేశానికి కానీ, పాలసీదారులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఈ సవరణలు చట్ట రూపం పొందితే, జాతీయకరణకు ముందు నాటి ప్రయివేట్‌కంపెనీల మోసాలు మళ్లీ పునరావతమైతాయని పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా ప్రతిఘటిద్దామని తెలిపారు. జాతీయకరణ లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎల్‌ఐసి ప్రపంచ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ను వ్యతిరేకించాలన్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గోపవరం : బద్వేల్‌ పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డిఐలను వ్యతిరేకించాలని పేర్కొన్నారు. ఎఫ్‌డిఐకి, విదేశీ బీమా కంపెనీల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, మేధావులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్‌ కె. నాగేంద్రబాబు, పట్టణ నాయకులు కె. శివకుమార్‌, ఎస్‌ .రాయప్ప, జి. సుబ్బరాయుడు, రమణయ్య పాల్గొన్నారు.

➡️