ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

యుటిఎఫ్‌ జిల్లా మద్యంతర కౌన్సిల్‌ పిలుపు
ప్రజాశక్తి- కడప అర్బన్‌
నూతనంగా కొలువు తీరబోయే కొత్త ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్‌, పాలెం మహేష్‌ బాబు కోరారు. సోమవారం కడప యుటిఎఫ్‌ భవన్‌ లో యుటిఎఫ్‌ జిల్లా మధ్యంతర కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యంతర కౌన్సిల్‌ సందర్భంగా ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా, యుటిఎఫ్‌ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు మాదన విజయ కుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేసిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా పాఠశాలల విలీనం, మూడు రకాల సిలబస్‌ లు ప్రవేశపెట్టడం, ఒకే మాధ్యమం లోనే విద్యను బోధించాలనడం, ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయకుండా బోధనేతర పనులలో భాగస్వాములను చేయడం, అనవసరమైన యాప్‌లతో వేధించడం తదితర కారణాలతో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లిందని తెలిపారు. న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా ప్రతి దాడులకు పూనుకుని, కేసులు పెట్టడం, పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం చేసిందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించకుండా, ఒకటో తేదీ జీతం ఇవ్వడమే గొప్ప అనే పరిస్థితులను గత ప్రభుత్వం తీసుక వచ్చిందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించబడాలంటే ఉద్యోగులు తమ కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలంటూ మంత్రులు మాట్లాడారని, ఇలాంటి నియంతత్వ వైఖరి వల్లే గత ప్రభుత్వం పతనమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారం చేపడుతున్న కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఎన్నికల ముందు విద్యారంగ పరంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలిపారు. మెగా డిఎస్‌సిని విడుదల చేస్తూ తొలి సంతకం చేయాలని, పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలని, జీవో నంబర్‌ 117 ను రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలు ఒకటి నుండి 5వ తరగతి వరకు కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు, ప్లస్‌ టు వరకు కొనసాగించాలని, ప్రాథమిక విద్యను మాతభాషలోనే కొనసాగించాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మీడియాలను ఎంచుకునే హక్కు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కల్పించాలని కౌన్సిల్‌ అభిప్రాయ పడినట్లు తెలిపారు. సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను చెల్లించాలని, పిఆర్‌టిసిన వెంటనే ప్రకటించాలని, అంతవరకు ఇంటీరియర్‌ రిలీఫ్‌ ఫండ్‌ ను 27శాతం మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్‌ డిఎలను వెంటనే చెల్లించాలని, సిపిఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. బోధనకు అడ్డంకిగా ఉన్న యాప్‌ లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ విద్యారంగం పట్ల, ఉపాధ్యాయుల పట్ల చులకన భావం ప్రదర్శించకుండా ఉండాలని, న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరుబాట పడతామని తెలిపారు. నూతన ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు అమలు చేసే సందర్భంలో విద్యావేత్తలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలతో చర్చలు జరపాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేనిపక్షంలో సమస్యల సాధనకు ఉద్యమాలు, పోరాటాలే శరణ్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యా రంగానికి సంబంధించిన పలు తీర్మానాలను కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షురాలు ఆర్‌.సుజాత రాణి, జిల్లా ట్రెజరర్‌ కె.నరసింహ రావు, జిల్లా కార్యదర్శులు సి.వి రమణ, ఎస్‌.ఏజాస్‌ అహమ్మద్‌, కుర్రా చెన్నయ్య, చంద్ర ఓబుల్‌ రెడ్డి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు డి.రూతు ఆరోగ్య మేరి, ఐక్య ఉపాధ్యాయ పత్రిక కన్వీనర్‌ గాజులపల్లె గోపీనాథ్‌, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యుటిఎఫ్‌ కార్యకర్తలు హాజరయ్యారు.

➡️