ప్రజాశక్తి – కమలాపురం
గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి అని మనం దానిని జయించినట్లయితే చాలా వరకు హదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చని పెద్దచెప్పలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మెహరన్ తెలిపారు వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని పెద్దచెప్పలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని సివి రామన్ సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలిందని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి దినసరి ప్రార్థనను అలవారచుకోవడం, ఇష్టమైన పాటలు వినడమో, లేక పుస్తకాలు చదవడమో చేయాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.ఓబులు రెడ్డి మాట్లాడుతూ గుండె జబ్బులు నివారించడానికి సరియైన జీవనశైలిని ఎన్నుకోవాలని, తాజా పళ్లు కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు, చేపలు, తక్కువ చక్కెర తీసుకోవడం సరియైన నిద్ర వ్యాయామం అలవర్చుకోవాలని తెలిపారు. సివి రామన్ సైన్స్ క్లబ్, కడప డివిజన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసుల రెడ్డి గుండె సంబంధిత జబ్బులు నివారణ జాగ్రత్తలు ఛాయ ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పరచి విద్యార్థులకు గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరి ప్రసాదు, కె. ప్రసాద్, రామచంద్ర, సునీల్ ఆరోగ్య కేంద్ర సిబ్బంది జయలక్ష్మి, విజయ కుమారి పాల్గొన్నారు.