ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలి

ప్రజాశక్తి – బద్వేలు
పట్టణంలో కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలను విక్రయిస్తున్న ఎరువుల అంగళ్లపై దాడి చేసి వాటిని అరికట్టాలని, సకాలంలో సబ్సిడీని అందించి రైతులను ఆదుకోవాలని డివైఎఫ్‌ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్‌ చేశారు. బద్వేల్‌ పట్టణ రూరల్‌ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఎడిఎ ఎం. నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ బద్వేల్‌ నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి భూసార పరీక్షలు చేస్తున్నారే తప్ప వాటి ఫలితాలు ఇప్పటివరకు ప్రకటించలేదని తెలిపారు. దీని కారణంగా బద్వేల్‌ నియోజకవర్గం లో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే ఫలితాలను ప్రకటించి రైతుల అభివద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. బద్వేల్‌ ప్రాంతంలో అధికంగా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయి స్తున్నారని వాటిని గుర్తించి కల్తీ ఎరువుల బారి నుండి రైతులను కాపాడా లన్నారు. అతి తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు అందించాలని, సకాలంలో భూ సారాన్ని పెంచే జిప్సం, జింక్‌ ప్రభుత్వ సబ్సిడీతో పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.కె. మస్తాన్‌ షరీఫ్‌, గంగనపల్లి నాగార్జున, రూరల్‌ కార్యదర్శి యు బాల గురవయ్య, ఉపాధ్యక్షులు యువరాజ్‌, ఆంజనేయులు, ట్రెజరర్‌ సురేంద్ర పాల్గొన్నారు.

➡️