పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి
ప్రజాశక్తి – వేంపల్లె : కూటమి ప్రభుత్వానికి అన్నదాన సత్రాలను, ఆశ్రమాలను కూల్చాడమేనా సంపద సృష్టి, సనాతన ధర్మమా అని సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లను పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. బుధవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బద్వేల్ నియోజక వర్గంలోని కాశినాయన మండలం, జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశిరెడ్డి నాయన గుడికి సంబంధించిన విశ్రాంతి గదులను, స్నానపు గదులను, గోశాలను, క్షౌర శాలను ఇటీవల అటవీ, పోలీసు, రెవిన్యూ శాఖల అధికారులు కూల్చివేయడం అత్యంత దురదృష్టకరం అన్నారు. కాసిరెడ్డి నాయన అవధూత గొప్ప ఆధ్యాత్మిక గురువు అన్నారు. షిర్డీ సాయి బాబాకు, వీర బ్రహ్మంకు ఉన్నట్లే కాసిరెడ్డి నాయనకు కోట్లాదిమంది భక్తులు ఉన్నారని చెప్పారు. 1995 డిసెంబర్ 6న 104 సంవత్సరాల వయస్సులో జ్యోతిక్షేత్రం లో ఆయన నిర్యాణం చెందారని చెప్పారు. భక్తులు అక్కడ ఆయన సమాధికి గుడి కట్టించి అన్నదాన సత్రం, గోసాల, మిగతా కట్టడాలు నిర్మించారని చెప్పారు. నిత్యం వేలాది మంది అన్నార్థులకు అన్నదానం జరుగుతుందని తెలిపారు. 1999లో నరసాపురం కేంద్రంగా కాశినాయన మండలం ఏర్పాటైందని చెప్పారు. ప్రభుత్వ నిధులతో రోడ్డు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటవీ శాఖ అనుమతులు లేవని కట్టడాలను కూల్చివేయడం అమానుషం అన్నారు. అనుమతులు లేకుంటే అనుమతులు తెప్పించాలి కాని కూల్చివేయడం ఏమీటి అన్నారు. కట్టడాల కూల్చివేత ఆపు చెయ్యాలని డిమాండ్ చేశారు. అటవీ అనుమతులు తెప్పించాలి కోరారు. కూల్చివేసిన కట్టడాలను పునరుద్ధరించాలని చెప్పారు. కాశి నాయన గుడిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.