పేదలకు భూపంపిణీ చేయాలి : వ్య.కా.స

ప్రజాశక్తి-అట్లూరు
మండల పరిధిలోని నల్లాయపల్లె, సర్వేనెంబర్‌ 40లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి. అన్వేష్‌ మండల ప్రధాన కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమలాకూరు గ్రామం, వలస పాలెంచ కమలకూరు బిసి కాలనీ వాసులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లయి పల్లె ప్రభుత్వ భూములను పదేళ్ల నుంచి స్థానికులకు టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఇవ్వకుండా అన్యాయం చేశాయని వాపోయారు. భూ పంపిణీ పట్ల నిర్లక్ష్యంగా రెండు ప్రభుత్వాలు వ్యవహరించాయని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా అసైన్మెంట్‌ కమిటీ ద్వారా భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కొందరు కబ్జాదారులు 30 నుంచి 50 ఎకరాల చొప్పున కంచెలు వేసుకుని జామాయిల్‌ మొక్కలు నాటుకుని ఎస్టేట్లుగా ఏర్పాటు చేసుకున్నారని, ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో గురమ్మ, సుహాసిని, సుసిని సుభద్ర, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

➡️