బ్రిడ్జి కోసం గొల్లపల్లి గ్రామస్తుల ఎదురుచూపు
ప్రజల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు, పాలకులు
ప్రజాశక్తి – బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని గొల్లపల్లి గ్రామస్తులు వ్యవసాయం, పశువుల పైన తమ జీవనం సాగిస్తుంటారు. అయితే బ్రహ్మ సాగర్ కుడి కాలువ తమ గ్రామ సమీపము నుండి వెళుతుంది. కాలువకు అటువైపులా కొండ ప్రాంతం బీడు భూములు ఉన్నాయి. పశువులు మేతకు వెళ్ళుటకు కాలవ దాటుకొని వెళ్లవలసిన పరిస్థితి అయితే కుడి కాలువకు నీళ్లు వదిలినప్పుడు కిలోమీటర్, రెండు కిలోమీటర్ల మేర సోమిరెడ్డి పల్లె,వడ్డెను బావి తిరుగుకొని వెళ్లవలసిన పరిస్థితి. తమ గ్రామ సమీపంలో వెళ్తున్నటువంటి కాలువకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని గతంలో అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జి ఏర్పాటు చేయలేదు.
కాలువ ద్వారా దాటుకొని వెళ్లాలంటే బలమైన సాహసమే చేయవలసి వస్తుంది. పలుసార్లు గొర్రెలు కొట్టుకువెళ్లినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కువగా యాదవులు ఉన్న గ్రామం, గొర్రెల పెంపకం పైనే వీరి జీవనాధారం మా గోడు ఆలకించి బ్రిడ్జి, ఇనుప వంతెన అయినా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు.