మైనింగ్‌ తవ్వకాలతో కాలుష్యం

పంటలు,తాగునీరు కలుషితంవన్యప్రాణులు ,పశువులు, జీవాలూ మత్యువాత
పట్టని అధికారులు
ప్రజాశక్తి – ముద్దనూరు
సిలికాన్‌ పౌడర్‌ కోసం మైనింగ్‌లో చేపట్టే తవ్వకాలు భారీ పేలుడు శబ్దాల ధాటికి వచ్చే కాలుష్యంతో పంటలు, తాగునీరు కలుషితమై వన్య ప్రాణులు, పశువులు, జీవాలూ మత్యువాత పడుతున్నాయి. సిలికాన్‌ పౌడర్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఒక చోట తవ్వకాలు మరొక చోట జరిపి యాజమాన్యం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను ఫ్యాక్టరీ యాజమాన్యం భయ బ్రాంతులకు గురి చేసి కారు చౌకగా అగ్రిమెంట్ల ద్వారా భూములను కొనుగోలు చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. మైనింగ్‌ తవ్వకాల్లో జరిపే భారీ పేలుడు శబ్దం ధాటికి వన్యప్రాణులు మత్యువాత పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మైనింగ్‌ చుట్టు పక్కల ఉన్న శెట్టివారిపల్లె, కమ్మవారిపల్లె, కొత్త చౌటిపల్లె, మంగపట్నం, కోడిగాండ్ల పల్లె గ్రామాల ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. దీంతో గాలి, నీరు కలుషితమై పశువులు, జీవాలూ, జంతువులు, తాము అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం వల్ల పంటలు, చీనీ చెట్లు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గొంతు, ఊపిరి తిత్తుల కేన్సర్‌ బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్మికులతో గొడ్డు చాకిరి చేయిస్తూ కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసే కార్మికులు ఊపిరితిత్తుల కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిషేధిత ప్రాంతాల్లో తవ్వకాలు జరూపుతూ ఆది మానవుడు గీసిన రేఖా చిత్రాలు ఛిద్రం చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రాయల్టీ చెల్లించకుండా సరుకు దొంగ రవాణా చేయడం వల్ల పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడిందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు, టిప్పర్ల ద్వారా సిలికాన్‌ పౌడర్‌ తరలిస్తూ ఆర్జిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. మైనింగ్‌ తరలించేందుకు వాహనాల రాకపోకలకు రహదారి అనుమతి లేకున్నా ప్రభుత్వ, పట్టా భూముల్లో దౌర్జన్యంగా యథేచ్చగా రవాణా చేస్తున్నారన్నారని పలువురు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మైనింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసి కాలుష్యం బారి నుండి పశువులు, జీవాలూ, పంటలను, నీటిని సంరక్షించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.కాలుష్యం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాలుష్యం వల్ల పంటలు, తాగునీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.వన్య ప్రాణులు మత్యువాత పడుతున్నాయి. అనుమతులు ఒక చోట తవ్వకాలు మరొక చోట చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద ప్రజల అసైన్‌ భూములను భయ బ్రాంతులకు గురి చేసి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్పందించి మైనింగ్‌లో తవ్వకాలు నిలిపి యాజమాన్యంపై చర్యలు తీసుకుని లైసెన్స్‌ రద్దు చేయాలి.- రామకష్ణారెడ్డి, రైతు కోడిగాండ్లపల్లె.

➡️