ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

విత్తనం, ఎరువుల కొనుగోలు పనుల్లో రైతులు నిమగం
ఈ ఏడాది సాగు పెంచేందుకు ప్రణాళికలు
ప్రజాశక్తి – చాపాడు
ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు దుక్కులు చేపట్టి పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు సేకరణ వంటి పనులు చేపడుతున్నారు. పసుపు సాగు చేసే రైతులు విత్తన సేకరణ, ఎరువుల కొనుగోలు రుణాల సేకరణ వంటి పనుల్లో నిమగమయ్యారు. అధికార యంత్రాంగం కూడా సంసిద్ధమైంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. రసాయనిక ఎరువులు, విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు గత ఖరీఫ్‌ కంటే ఈసారి సాగు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మార్పులు చేర్పులు జరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందట జిల్లాలో భారీ వర్షాలు కురవడంతోపాటు జిల్లాలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం కష్ణా జలాలతో నింపింది. మరోవైపు భూగర్భ జలాలు పైకి చేరడంతో వేలాది బోరు బావుల్లోనూ పుష్కలంగా నీరు చేరింది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం సీజన్‌లో వర్షాలు ప్రారంభం కావడంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది సాగు మరింత పెరగనుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగును మరింత పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో వేరుశనగ, వరి, శనగ తదితర పంటలు సాగు చేస్తారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు, కడప తదితర ప్రాంతాల్లో వరితోపాటు పసుపు, మిరప, పత్తి, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు వరి, చెరుకు, మామిడి, వేరుశనగ, సన్‌ఫ్లవర్‌, ఇతర కూరగాయల పంటలు విరివిగా సాగు చేస్తారు. 2019 ఖరీఫ్‌లో 73,792 హెక్టార్లలో పంటలు సాగు కాగా, 2020 ఖరీఫ్‌లో 1,10,127 హెక్టార్లలో, 2021-22 ఏడాదుల్లో 1,24,000 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 2023 లో సాగు గణనీయంగా తగ్గింది. 70వేల హెక్టార్లకే పరిమితమైంది. ఈ ఏడాది సాగును మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 68,756 క్వింటాళ్ల పంపిణీకి చర్యలు… ఖరీఫ్‌లో 68,756 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందిస్తుందన్నారు. ఇందులో ప్రధానంగా 14,602 క్వింటాళ్లు కేబీ రకం, వేరుశనగ విత్తనాలు, 1500 క్వింటాళ్లు నారాయణి రకం, 1000 క్వింటాళ్లు టీఏజీ – 24 రకం విత్తనాలు, అలాగే 950 క్వింటాళ్ల మినుములు, 692 క్వింటాళ్లు ఎల్‌బీజీ – 752 రకం మినుము విత్తనాలు, 418 క్వింటాళ్లు పీబీజీ – 104 రకం విత్తనాలకు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు 39,870 క్వింటాళ్లు శనగలు, 4780 క్వింటాళ్ల జీలుగ, 463 క్వింటాళ్ల జనుము, 80 క్వింటాళ్ల పిల్లి పెసర తదితర విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఏటా 2,98,673 మంది రైతులకు ఆర్థికసాయం అందిస్తుండగా, సున్నా వడ్డీ పంట రుణాల కింద 90,000 మందికి సుమారు రూ. 50 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక పంటల బీమా కింద 2,89,922 మందికి రూ. 777.50 కోట్లు లబ్ధి చేకూరింది. మరోవైపు తగిన మేర సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. ఖరీఫ్‌ సాగు 1.35 లక్షల హెక్టార్లపైనే గత ఏడాది ఖరీఫ్‌లో 70వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరం దీన్ని1,35,100 ఎకరాలకు పైగా పెంచాలన్నది లక్ష్యం. ప్రధానంగా 33,994 హెక్టార్లలో వరి, 23,698 హెక్టార్లలో పత్తి, 23,149 హెక్టార్లలో వేరుశనగ, 3,578 హెక్టార్లలో కంది, 2563 హెక్టార్లలో సన్‌ఫ్లవర్‌, 2,603 హెక్టార్లలో శనగ, 177 హెక్టార్లలో పెసర, 276 హెక్టార్లలో జొన్న, 43 హెక్టార్లలో చెరకు, 2828 హెక్టార్లలో పసుపు, 4833 హెక్టార్లలో ఉల్లిగడ్డలు, 948 హెక్టార్లలో చీనీ, 1754 హెక్టార్లలో టమాటా తదితర పంటలను సాగు చేయించాలన్నది లక్ష్యం. మొత్తంగా 1,35,100 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగును అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.సాగుకు ఏర్పాట్లు చేస్తున్నాం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో వరి పంట సాగుకు ఏర్పాట్లు చేపడుతున్నాం. ఇప్పటికే జీలగ విత్తనాలు సేకరించాం. దుక్కులు చేపట్టి సేంద్రియ ఎరువులు పంట పొలాల్లో చల్లకాలు చేశాం. జులై రెండవ వారంలో వరి నారు సాగు చేసేందుకు విత్తన సేకరణలో ఉన్నాం. వ్యవసాయ పనులకు అవసరమైన ఖర్చులకోసం బ్యాంకులో రుణాలు రెన్యువల్‌ చేసుకుంటున్నాం.- లక్ష్మిరెడ్డి, రైతు, అయ్యవారిపల్లి,చాపాడు.బ్యాంకు రుణాలు సిద్ధం చేసుకుంటున్నాం ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల సేకరణలో బ్యాంక్‌ రుణాలు కోసం తిరుగుతున్నాం. ప్రస్తుతం బ్యాంకులో పాత బకాయిలు చెల్లించి నూతనంగా రుణం పొందేందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం. విత్తనాలు, ఎరువులు సేకరించాలంటే నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. గత ఏడాది వరి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం. ప్రస్తుతం ఇతర పంటలు సాగు చేసే అవకాశం లేకపోవడంతో తిరిగి వారి సాగుకు చర్యలు చేపడుతున్నాం.- ఆంజనేయులు, రైతు ,ఖాదర్‌పల్లె.

➡️