ప్రజాశక్తి – చాపాడు : మురికి కుంటలలో దోమలు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎల్ఏటిఓ జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రమైన చాపాడులో నిర్వహిస్తున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ కాలువల్లో, ఖాళీ ప్రదేశాల్లో మురికికుంటలలో దోమలు అధికంగా ఉన్నాయన్నారు. వీటిలో దోమలు నిల్వ లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. దోమలు వృద్ధి చెందడం వలన అనేక రకాలైన జ్వరాలు రోగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వేలు, టీకా కార్యక్రమాలను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్ సీ లో అందుబాటులో ఉన్న రక్త నమూనా పరికరాలను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, పిహెచ్సి ఆవరణలో పారిశుధ్యం పై ఆయన పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాజేష్ కుమార్, శ్రీవాణి, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సర్పంచ్ కుమారుడు మాబు వల్లి, ఏఎన్ఎం స్రవంతి సిబ్బంది పాల్గొన్నారు.