కౌంటింగ్‌ సిబ్బందికి ర్యాండమైజేషన్‌

జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజు
ప్రజాశక్తి -కడప
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1035 మంది కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్‌ ద్వారా విధులను కేటాయించాయించామని జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి హాలులో జిల్లా జెసిగణేష్‌ కుమార్‌, జిల్లా ఎలెక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రత్యేక పర్యవేక్షకులు, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి సార్వత్రిక ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్‌ సిబ్బందికి విధులను కేటాయించే మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన ప్రకారం కౌంటింగ్‌ సిబ్బందికి నియామక ఉత్తర్వులను సంబంధిత తహశీల్దార్ల ద్వారా అందజేస్తామని తెలిపారు. కౌంటింగ్‌ సిబ్బందికి కడప నగరం అన్నమయ్య సర్కిల్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ హై స్కూల్‌ (మెయిన్‌)లో 29న ఉదయం 09.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి ర్యాండమైజేషన్‌ ద్వారా విధులను కేటాయించిన వారికి జూన్‌ 2వ తేదీన రెండవ ర్యాండమైజేషన్‌, జూన్‌ 4వ తేదీన ఉదయం 5 గంటలకు 3వ ర్యాండమైజేషన్‌ నిర్వహించి ఏ టేబుల్‌లో కౌంటింగ్‌ నిర్వహించాలో తెలియజేస్తారన్నారు. కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో పాటు సిపిఒ వెంకట్రావు, డిఐఒ విజరు కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️