ప్రజాశక్తి -కడప అర్బన్
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మూడు క్యూ లైన్లు టిటిడి అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల సంఘటనను దష్టిలో పెట్టుకొని ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా ఎస్‌పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు చిన్న చౌక్ సిఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు క్యూ లైన్‌లో తోపులాటకు గురికాకుండా ఏప్పటికప్పుడూ పర్యవేక్షించారు. స్థానికులతో పాటు, స్థానికేతరులను కూడా స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో అనుమతించారు. ఊరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ దేవుని కడప, పాత కడప పెద్దలను, యువతను టపాసుల శబ్దాలతో, బ్యాండు వాయిద్యాల మధ్య రథం వరకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రథోత్సవం ప్రారంభమైంది. సాయంత్రం రథం కుదుటపడింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు ఎక్కువ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రథాన్ని గమ్యస్థానం చేర్చడంలో ఆలస్యం అయింది. కార్పొరేషన్ అధికారులు స్పందించి దేవుని కడప రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టాలని ప్రజల కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే మాధవి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పానకం పంపిణీ .. మేము సైతం సేవా సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రథసప్తమి సందర్భంగా 2000 మందికి పానకం, 1000 మంది కి అన్నసంతర్పణ చేశారు. మేము సైతం సేవా సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలసి పంపిణీ చేశారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ సిఐ ఓబులేసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పానకం, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
