ప్రజాశక్తి – చాపాడు : కడప జిల్లా చాపాడు మండల పరిధిలో ఖరీఫ్ సీజన్ లో వరి పంట సాగు చేపట్టి ప్రస్తుతం నూర్పిడి చేపడుతున్న రైతులు ఫెంగల్ తుఫాన్ తాకిడికి విలవిలలాడిపోతున్నారు. ఆరుకాలం కష్టించి పండించిన పంట చేతికి అంది వచ్చిన సమయంలో తుఫాన్ రావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రైతులు కళ్ళ ఎదుటే వరి పంట నేలకొరుగుతుంటే వాటిని వర్షంలోనే తడుస్తూ నిలబెట్టుకునే ప్రయత్నాలు చేపడుతున్నారు. మరి కొంతమంది రైతులు నూర్పిడి చేపట్టి ధాన్యం తడవకుండా టార్పలిన్ పట్టలను కప్పుకుంటూ, వర్షం ఆగినప్పుడు వాటిని తిరిగి ఆరబెట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో ఖరీఫ్ సీజన్ లో కుందు, పెన్నా, కేసీ కాలువ ఆధారంగా 12వేల ఎకరాలకు పైగా వరి పంటను రైతులు సాగు చేపట్టారు. ఇప్పటికే 2వేల ఎకరాలలో పంట నూర్పిడి పూర్తయినది. మిగిలిన పంట అంతా నూర్పిడి దశలో ఉన్నది. గత నాలుగు రోజులుగా తుఫాన్ ప్రభావంతో వర్షం పడుతుండటం వలన పంట బాగా తడవటం నేలకొరుగుతున్నది. బుధ, గురువారాల్లో అధిక వర్షం నమోదైనది. అల్లాడుపల్లె వద్ద స్థానిక పిహెచ్ సీ వద్ద, రోడ్లపై ఖాళీ ప్రదేశాలలో వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు పోలాలను పరిశీలిస్తున్నారు.
