ప్రజాశక్తి – కడప అర్బన్
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఎస్‌పి వి.హర్షవర్ధన్ రాజు సోమవారం నగరంలోని ఉమేష్ చంద్ర స్మారక పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు, హోం గార్డ్స్, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును సందర్శించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అరుణాచల, శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆస్పత్రుల స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి(కార్డియాలజీ), జయ ప్రకాష్ (పల్మనాలజీ), షైక్ నవీద్ అహ్మద్ (కార్డియాలజీ), కరీముల్లా (యూరాలజీ), సోహైల్ మాలిక్ (నెఫ్రాలజీ), మమతేశ్వరి జంగా(గైనకాలజి ), కాంతి కుమార్ (న్యూరో సర్జన్), రిమ్స్ వైద్యులు కష్ణ చైతన్య (ఆర్థో) భాగ్యలక్ష్మి (డెంటిస్ట్), శివా నాయక్ (ఫిజియో థెరపిస్ట్) వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజా క్షేత్రంలో నిత్యం ప్రజల సేవకే అంకితమైన పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. డాక్టర్ మమతేశ్వరి తో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు