స్ట్రాంగ్ రూమును అర్ధరాత్రి తనిఖీ చేసిన ఎస్పీ

May 16,2024 10:07 #Kadapa

ప్రజాశక్తి-కడప అర్బన్ : ఇ.వి.ఎం. లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా చర్యలను బుధవారం అర్ధరాత్రి ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 24X7 గంటల నిరంతరంగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు, నిఘా కెమెరాలతో పర్యవేక్షణలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఇ.వి.ఎం. బాక్స్ లను జిల్లా కేంద్రంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మౌలానా అజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ ల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడిన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడ కూడా 4 గురు అంతకు మించి గుంపులు, గుంపులుగా ఉండకూడదని చెప్పారు. అనుమతులు లేకుండా ఎక్కడ సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, ఎ.ఆర్ డి.ఎస్పీ మురళీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

➡️