ప్రజాశక్తి – వేంపల్లె : నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశ భక్తి పరాయణుడు, సాహస వీరుడని పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. దీంతో సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి తులసిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధులలో నేతాజీ అగ్రగణ్యుడని చెప్పారు. భారతమాత దాస్య శృంఖలాలు చేధించేందుకు విదేశాలలో అజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసిన పోరాట యోధుడు అన్నారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి – నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పిన దేశ భక్తి పరాణయుడు అన్నారు. తన జీవితమంతా సాహసమే ఊపిరిగా జీవించిన సాహస వీరుడని తెలిపారు. జైహింద్ నినాదం సృష్టికర్త అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేశారని చెప్పారు. నాడు నేతాజీ స్వరాజ్యం కోసం పోరాడాడని నేడు మనం సురాజ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నేతాజీ జీవితం అందరికీ ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకమని తులసి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, చెన్నకేశవ, ఉత్తన్న, అమర్నాథ్ రెడ్డి, రవి, వేమా నాగరాజ, బద్రీనాథ్, చిన్నకొట్ల శేఖర్ పాల్గొన్నారు.
