ఉల్లిరైతు కంట కన్నీరు

ప్రజాశక్తి – చాపాడు
ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్మకం దశకు వచ్చేసరికి ఉల్లి ధరలు అమాంతం తగ్గిపోవడంతో పంట సాగుచేసిన రైతులు అయోమయంలో పడ్డారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా 20 రోజులుగా ఉల్లి పంట నూర్పిడి చేపడుతున్నారు. దసరా పండుగకు ముందు ఉల్లి పంట నూర్పిడి చేసిన రైతులకు వర్షం దెబ్బ తగిలింది. నూర్పిడి చేసిన తరువాత ధరలు అమాంతం తగ్గడంతో పంట సాగు చేసిన రైతులు నిరాశలో పడ్డారు. బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఉల్లి ధరలు కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ఉంది. కానీ రైతుల విషయానికి వచ్చే సరికి వారికి మొండి చెయ్యి మాత్రమే మిగిలుతోంది. మధ్యలో వ్యాపారులు, దళారులు ప్రవేశించి రైతులకు అన్యాయం చేస్తున్నారు. సెప్టెంబర్‌ నెల చివరి వారంలో, అక్టోబర్‌ మెదటి వారంలో ఉల్లి పంట నూర్పిడి చేసిన రైతులు ఉల్లి పంటను క్వింటా రూ.3200కి అమ్మకాలు చేశారు. అక్టోబర్‌ రెండవ వారంలో క్వింటా ధర రూ. 2700, తిరిగి మూడవ వారంలో రూ. 3 వేలకు చేరింది. తరువాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం క్వింటా రూ.1500కు పడిపోయింది. వర్షానికి తడిసిన గడ్డలు రూ.వెయ్యికి కూడా అడగటం లేదని రైతులు వాపోతున్నారు. చెన్నై, తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వెళ్లిన రైతులకు మరింత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. క్వింటాను రూ. 500 కు వ్యాపారులు మార్కెట్లో అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. పంట దిగుబడి అమ్మకం కాకపోవడంతో వాటిని మార్కెట్‌కు తరలించేందుకు అదనపు భరించ లేక ఏమిచేయాలో తెలియక రైతులు దిగాలు చెందుతున్నారు. ఇతర ప్రాంతాల మార్కెట్లకు ఉల్లిగడ్డలను తరలించిన రైతులు రోజుల తరబడి అమ్మకాల కోసం ఎదురుచూసి చివరకు దళారులు నిర్ణయించిన ధరకు పంటను అమ్ముకొని నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ఏడాది ఉల్లికి మంచి ధరలు ఉన్నాయని పది రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. పంటకు నిలకడగా ధరలు లేకపోవడం, స్థానికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. పంట సాగు చేసే సమయంలో అధిక ధరలు ఉంటూ, చేతికి అంది వచ్చే సమయంలో అమాం తం తగ్గిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మైదు కూరు, చాపాడు, దువ్వూరు మండలాల పరిధిలో వేల ఎకరాలలో ఉల్లి పంటను రైతులు ప్రస్తుతం నూర్పిడి చేస్తున్నారు. సరైన డిమాండ్‌ లేకపోవడంతో అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో సాగు ప్రశ్నార్ధకంగా మారనుంది.కౌలుకు తీసుకుని నష్టపోయా.. ఉల్లి పంటను ఎకరా రూ. 20 వేలకు కౌలుకు తీసుకుని సాగు చేశాను. సాగు ఖర్చులు ఎకరాకు రూ.80 వేల వరకు అయ్యాయి. ప్రస్తుతం ధరలు చూస్తే దిగుబడి సమయంలో అమాంతం తగ్గిపోయాయి. క్వింటా రూ. 1500కు కూడా వ్యాపారులు అడగడం లేదు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలి. – కుమార్‌, ఉల్లి రైతు, నాగాయపల్లి ,దువ్వూరు మండలం.అమ్మకాల సమయంలో ధరలు తగ్గాయి.. ఉల్లి పంటను సాగు చేసి ప్రస్తుతం అమ్మకం చేసే సమయంలో ధరలు అమాంతం తగ్గాయి. 20 రోజుల కిందట క్వింటా రూ. 3వేలకు కు పైగా ఉన్న ధరలు ప్రస్తుతం రూ.1500కు చేరింది. ఉల్లిగడ్డలు వర్షానికి తడవడంతో వ్యాపారులు ఏమాత్రం అడగడం లేదు. ఇతర ప్రాంతాల్లో మార్కెట్‌కు తరలిస్తామనుకుంటే అక్కడ కూడా పరిస్థితి అధ్వానంగా ఉంది. స్థానికంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.-ప్రతాపరెడ్డి ,రైతు ద్వారకానగరం, చాపాడు మండలం.

➡️