ప్రజాశక్తి – కడప అర్బన్
బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డిఐకి, విదేశీ బీమా కంపెనీల ప్రవేశానికి వ్యతిరేకంగా ఈనెల 4న నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎల్‌ఐసి యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అవధానం శ్రీనివాస్, ఎ.రఘునాథ్ రెడ్డి అన్నారు. సోమవారం యూనియన్ కార్యాలయంలో ‘బీమా చట్ట సవరణ బిల్లును తిరస్కరిద్దాం’ పేరుతో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లు 2024ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ సవరణలతో దేశానికి కానీ, పాలసీదారులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఈ సవరణలు చట్ట రూపొందితే, జాతీయకరణకు ముందు నాటి ప్రయివేటు కంపెనీల మోసాలు మళ్లీ పునరావతమైతాయని తెలిపారు. ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా ప్రతిఘటిద్దామని పిలుపునిచ్చారు. జాతీయకరణ లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎల్‌ఐసి ప్రపంచ స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ని వ్యతిరేకిద్దాం, విదేశీ కంపెనీలను తిరస్కరిద్దాం పేరుతో తాము ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు అక్బర్ బాషా, వసుప్రద, వారిజాతమ్మ, రత్నకిషోర్, జె.రఘు శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.
