రాములోరి కల్యాణానికి వైభవంగా ఏర్పాట్లు

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 11న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు తెలిపారు. ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి జెఇఒ వి.వీరబ్రహ్మం, జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా, నిర్మాణాత్మకంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తులకు అందరికీ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందేంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. టిటిడి విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శ్రీ సీతారాముల కల్యాణం రోజున ఎలాంటి విద్యుత్‌ అంతరాయం కలగరాదని, అవసరమైన జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో అగ్ని మాపక శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆహ్వానం పత్రికలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్‌ అలంకరణలు, సాంస్కతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేయనున్న పనులను చైర్మన్‌కు నివేదించారు. అంతకు ముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని టిటిడి చైర్మన్‌ అధికారులతో కలిసి పరిశీలిం చారు. కల్యాణ వేదిక ప్రాంగణాన్ని చక్కని పుష్ప, విద్యుత్‌ అలంకరణలతో అలంకరించాలని సూచించారు. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో పటిష్టంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను ద ష్టిలో ఉంచుకుని వేసవి నేపథ్యం, అనుకోకుండా వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెల 15న అమరావతిలో శ్రీనివాస కల్యాణోత్సవం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో కడప ఆర్‌డిఒ జాన్‌ ఇర్విన్‌, డిఎస్‌పి వేంకటేశ్వర్లు, టిటిడి డిప్యూటీ ఇఒలు నటేష్‌ బాబు, ప్రశాంతి, గోవింద రాజన్‌, సెల్వం, ఎస్‌ ఇలు వేంకటేశ్వర్లు, మనోహర్‌, అడిషనల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, విజిఒ సదాలక్ష్మి, అసిస్టెంట్‌ జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ వి.ఆదినారాయణరెడ్డి, సేల్స్‌ వింగ్‌ ప్రత్యేక అధికారి రామరాజు, ఎఇఎస్‌ఒ వై.సతీష్‌ కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం, పంచసూక్తం పవమాన హోమాలు నిర్వహించారు. మహా పూర్ణాహుతి, వషభ లగంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ : ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను ఆలయంలో టిటిడి చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, జెఇఒ వి.వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 6వ తేదీన శ్రీరామనవమి, పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్‌ 9న హనుమంత వాహనం, ఏప్రిల్‌ 10న గరుడవాహనం, ఏప్రిల్‌ 11న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 12న రథోత్సవం జరుగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు విస్తతంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు.

➡️