ప్రజాశక్తి – ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్
పశు వైద్య విద్యార్థులు అడుతున్నది న్యాయమైన కోర్కెలని, అవి గొంతేమ్మ కోరికలు కాదని ప్రభుత్వం ఆలోచించాలని జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. బుధవారం స్థానిక గోపవరం పంచాయతీలోని పశువైద్య కళాశాలలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జూనియర్ డాక్టర్స్‌ను కలిసి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ ఉద్యోగి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనేది ప్రభుత్వ జీవో ఉందన్నారు. న్యాయమైన విషయం అడిగిన వారికి ఒక శక్తి ఉంటుందన్నారు. నిరసన ఇలాగే కొనసాగించాలన్నారు ప్రభుత్వం నుంచి బెదిరింపులు వచ్చినా తలోగ్గొకుండా పోరాటం కొనసాగించాలని పిలుపు నిచ్చారు. అలసిపోకుండా పోరాటం చేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. 38 రోజులుగా దీక్షలు చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం రైతులను, ప్రజాసంఘాలను, విద్యార్థి సంఘాలను, కుల సంఘాలను కలుపుకొని పోరాటం ఉధతం చేయాలన్నారు. పోరాటం ప్రజలకు కూడా తెలిసే విధంగా రోడ్డుమీదికొచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పశు వైద్య విద్యార్థుల స్టైఫండ్ విషయంలో ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్‌తో మాట్లాడతానని విద్యార్థు లకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తవ్వా సురేష్ మాట్లాడుతూ పశు వైద్య విద్యార్థుల స్టైఫండ్ విషయంలో ప్రభుత్వం రూ. 7 వేల నుంచి రూ. 10,500 పెంచే ఆలోచనలో ఉందని ప్రభుత్వ భ్రమలో పడొద్దన్నారు. ఎంబిబిఎస్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో సమా నంగా స్టైఫండ్ ఇచ్చేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న పశువైద్య విద్యార్థుల విషయంలో మాట్లాడే నాయకుడే లేరన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారని, ప్రజల కోసం, విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం మాట్లాడే నాయకుడే లేరని వాపోయారు. పశు వైద్య విద్యార్థుల కోసం మార్చి 15న ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర సమత నాయకులు డాక్టర్ ప్రసన్న, సిపిఎం పట్టణ అధ్యక్షులు కె. సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్, డి వైఎఫ్ ఐ పట్టణ కార్యదర్శి విశ్వనాథ్ , అప్కాస్ పశు వైద్య కళాశాల అధ్యక్షులు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు సుబ్బయ్య పశు వైద్య కళాశాల జూనియర్ డాక్టర్స్ పాల్గొన్నారు.
