డివైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్
ప్రజాశక్తి-కడప అర్బన్ : ఈనెల 14న యూటీఎఫ్ భవన్ లో నిర్వహించే నిరుద్యోగ సదస్సు జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలో స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చారని కానీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీ నేటికీ అమలు కాలేదన్నారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పేరుతో ప్రచారం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లు కంపెనులు అయిన అదానీ, అంబానీలకు తాకట్టు పెడుతూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. విభజన హామీ అయిన కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కు కూడా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కు ముందుకు అడుగులు వేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలలో హామీలు ఇచ్చి కడప ఉక్కును విస్మరించిందన్నారు. అందుకు నిదర్శనమే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లలో కడప ఉక్కు కు నిధులు కేటాయించలేదని, అలాగే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుకు శ్రీకారం చుట్టలేదన్నారు. రాష్ట్రంలో డిఎస్సీ పై ప్రభుత్వం మొదటి సంతకం చేసింది గాని ఇంతవరకు పరీక్షకు తేదీలు ప్రకటించలేదన్నారు. కానిస్టేబుల్ మెయిన్స్ కూడా నిర్వహించడంలో తాత్సారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలో ఖాళీగా వున్న 2 లక్షల 30 వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని అది అమలు కాలేదన్నారు. వీటి సమస్యల పై నిరుద్యోగుల ఈనెల 14న కడపలో యుటిఎఫ్ భవన్ లో నిర్వహించే నదస్సు కు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నగర నాయకులు నరసింహ, అభినయ్, ఉదయ్ పాల్గొన్నారు.
