పాత పెన్షన్ పునరుద్ధరణే ఏకైక పరిష్కారం
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ కుమార్
ప్రజాశక్తి – బద్వేలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏకీకత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ఆమోదయోగ్యం కాదని, దానిని అంగీకరించే ప్రశ్నే లేదని యుటిఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు మాదన విజయకుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం బద్వేలులోని స్థానిక ఎన్‌జిఒహోమ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్‌పిఎస్ పేరును యుపిఎస్‌గా మార్చిందని ఆరోపించారు. 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని యుపిఎస్ పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ఇందులో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. పైగా ఈ పథకం అమలు ఐచ్చికం అని పేర్కొనడంలోనే అసలు మోసం దాగి ఉందన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేకుండా సర్వీసును బట్టి 50 శాతం పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే తమకు ఆమోదయోగ్యమని ఆయన పేర్కొన్నారు. యుపిఎస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ కాపీ అని, నూతన పెన్షన్ పథకం సంస్కరణకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్) అమలు అనేది దేశవ్యాప్తంగా ముఖ్యమైన రాజకీయ సమస్యగా మారిందని, గత లోక్‌సభ ఎన్నికలను సైతం ఇది ప్రభావితం చేసిందని ఆయన తెలిపారు. ఉద్యోగులలో వ్యతిరేకత, సమీప భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, కనీస ఉపశమనం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ, మోసపూరిత వ్యూహంగా ఏకీకత పెన్షన్ పథకం (యుపిఎస్) విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన ఆరోపించారు. పాత పెన్షన్ పథకానికి ప్రత్యామ్నాయంగా ఏకీకత పెన్షన్ పథకం అమలు ఆమోదయోగ్యం కాదని, పాత పెన్షన్ పథకాన్ని పూర్తిగా పునరుద్ధరిడమే ఏకైక పరిష్కారమని ఆయన తెలిపారు. పాత పెన్షన్ అమలు కోసం ఎఫ్‌ఆర్‌డిఎ చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పాత పెన్షన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో యుటిఎఫ్ బద్వేలు మండల ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్, ట్రెజరర్ ఎ.గుర్రయ్య, గోపవరం మండల అధ్యక్షుడు వీరదాసరి క్రిస్టఫర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్.ఎం.డి.గౌస్ పాల్గొన్నారు.కడప అర్బన్ : పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాల్సిన ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడాన్ని యుటియఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, తక్షణం దేశమంతటా పాత పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని యుటియఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి పాళెం మహేష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం యుటిఎఫ్ భవన్ లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 30న అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, ట్రెజరర్ నరసింహారావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్, నాయకులు గాజులపల్లి గోపీనాథ్, బత్తుల చంద్రశేఖర్,యడాల సురేష్ కుమార్,కరిముల్లా, కష్ణారెడ్డి,కేదార్నాథ్, కిరణ్ బాబు పాల్గొన్నారు.
