కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి – కడప అర్బన్
32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటు అయిన విశాఖ ఉక్కును ప్రయివేట్ పరం చేయాలని కేంద్రం చూస్తోందని, విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు విద్యార్థి,యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం విశాఖ ఉక్కు ప్రయివేటేకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కడపలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు.రాహుల్, వీరపోగు.రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు, కడప ఉక్కు పై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నయన్న సాకుతో కార్పొరేటు శక్తులకు అమ్మే కుటిల ప్రయత్నాలు బిజెపి పభుత్వం చేస్తుందని విమర్శించారు. ప్రాణాలర్పించైనా ప్రయివేటీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. విభజన హామీలో చట్టబద్ధంగా రాసుకున్న కడప ఉక్కుని సైతం కేంద్రం పక్షపాత ధోరణితో చూస్తూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువుతో, వలసలతో అల్లడిపోతుంటే పాలకులకు కనపడటం లేదన్నారు. వలసల నివారణకు కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గమన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోతున్నారన్నారు. అదే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే చదువుకున్న యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి ప్రభుత్వం కడప ఉక్కు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందన్నారు. కనీసం ఈ ప్రాంత ఎంపీలు సైతం కడప ఉక్కు కోసం పోరాటం చేయకపోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేకుంటే రాబోవు రోజులలో విద్యార్థులు, యువకులతో పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు నిర్మల్, నగర కన్వీనర్ విజరు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభినరు పాల్గొన్నారు.