మూడున్నరేళ్లుగా గడపకు చేరని శుద్ధజలం
డిఐపైప్‌లైన్ ఏర్పాటులో మీనమేషాలు
35 శాతం పనులు పెండింగ్
ప్రజాశక్తి – కడప ప్రతినిధి
పులివెందుల వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2021 మే నుంచి 2024 మే నాటికి 62 శాతం పనుల్ని పూర్తి చేయగా, 2024 జనవరి నుంచి 2025 జనవరి నాటికి కేవలం ఆరు శాతం పనులకు పరిమితం కావడం పనుల పురోగతి ఇట్లే అర్థమైపోతోంది. 2021 మేలో కడప జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా డోన్, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పట్టణాల్లోని ఇంటింటికీ శుద్ధజలాన్ని అందించాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అంతుబట్టని రీతిలో కిడ్నీ వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసింది. కడప జిల్లా పులివెందుల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును 2021 మే 21న రూ.460 కోట్ల కాంట్రాక్టును మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. 2023 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. నేటికీ అసంపూర్తి పనుల మధ్యే కొట్టుమిట్టాడుతోంది. పులివెందుల వాటర్‌గ్రిడ్‌కు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1,175 కి.మీ పైప్‌లైన్ ద్వారా శుద్ధిజలాన్ని సరఫరా చేయాల్సి ఉంది. రోజుకు 0.83 టిఎంసిల నీటిని పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, చక్రాయపేట, వేంపల్లి, వేముల మండలాల పరిధిలోని 299 హ్యాబిటేషన్లకు చెందిన 2,20,631 మందికి అందించాల్సి ఉంది. కాంట్రాక్టు సంస్థ 24 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. మూడున్నరేళ్ల వ్యవధిలో గడువు మీద గడువును పొడిగించుకుంటూ పనుల్ని పూర్తి చేయడం లేనే విమర్శలు ఉన్నాయి. మూడున్నరేళ్లలో ఏడాదికి సగటున 20 శాతం చొప్పున పులివెందుల వాటర్‌గ్రిడ్ 65 శాతం, డోన్ వాటర్‌గ్రిడ్ 70 శాతం పురోగతిని దాటని పరిస్థితి కనిపిస్తోంది. 2021 మే నుంచి 2023 మే నెలతో కాంట్రాక్టు గడువు ముగిసింది. అసంపూర్తి పనుల నేపథ్యంలో 2023 మే నుంచి 2024 మే వరకు, అనంతరం 2024 మే నుంచి 2025 నవంబర్ నాటికి కాంట్రాక్టు రెండు సార్లు గడువును ప్రభుత్వం పొడిగించింది. అయినప్పటికీ మరో 10 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంతటి స్వల్ప వ్యవధిలో 35 శాతం నుంచి 40 శాతం పనుల్ని పూర్తి చేయడంపై సందేహాలు నెలకొన్నాయి. డిఐ పైప్‌లైన్ ఏర్పాటులో కాంట్రాక్టు సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. టెండర్ నిబంధనల మేరకు 288 కి.మీ మేరకు డిఐ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 90 కి.మీ పైప్‌లైన్ ఏర్పాటు చేసింది. మిగిలిన 80 కి.మీ ఏర్పాటులో మీనమేషాలు లెక్కిస్తోంది. మార్కెట్‌లో డిఐ పైప్‌లు రెట్టింపు ధర పలుకుతున్న నేపథ్యంలో జంకుతున్నట్లు సమాచారం. పులివెందుల వాటర్‌గ్రిడ్ పనుల్లో జిఎల్‌ఆర్‌బిఎస్, ఒహెచ్‌ఆర్ బిఎస్, ఒహెచ్ ఆర్‌ఎస్, జిఎల్‌ఎస్‌ఆర్‌ఎస్ స్ట్రక్షర్లు కీలకమైనవి. 10 జిఎల్‌బిఆర్‌ఎస్ స్ట్రక్షర్లలో ఆరింటిని మాత్రమే పూర్తి చేసింది. 06 ఒహెచ్‌బిఆర్ ఎస్‌ల్లో ఐదింటిని పూర్తి చేసింది.11 సంపుల్లో ఐదింటిని మాత్రమే పూర్తి చేసింది. 09 జిఎల్‌బిఎస్‌ఆర్ స్ట్రక్షర్లలో రెండు మినహా మిగిలిన స్రక్షర్లు గ్రౌండింగ్ దశలో ఉండడం గమనార్హం. నాలుగు రకాల స్ట్రక్షర్ల పనుల అసంపూర్తి నేపథ్యంలో మిగిలిన 80 కిలోమీటర్ల డిఐ పైప్‌లైన్, 307 కి.మీ మేర హెచ్‌డిఎఫ్‌సి పైప్‌లైన్ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.ఏడాది వ్యవధిలో పూర్తి 2024 డిసెంబర్ నుంచి పైప్‌లైన్ పనులు ఊపందుకున్నాయి. 2026 మార్చి నాటికి పులివెందుల వాటర్‌గ్రిడ్ పనుల్ని పూర్తి చేస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 60 హ్యాబిటేషన్లకు నీటిని అందిస్తాం. 2026 మార్చి నాటికి మిగిలిన గ్రామాలకు తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తాం.- కె.ఏడుకొండలు, ఎస్‌ఇ, ఆర్‌డబ్య్లుఎస్, కడప.
