అభివృద్ధికి చిరునామాగా కాకినాడ : ఎమ్మెల్యే ద్వారంపూడి

Mar 10,2024 17:48 #dwara, #Kakinada, #MLA
  • రూ.9.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రజాశక్తి-కాకినాడ : గడచిన నాలుగున్నరేళ్ళలో కాకినాడ నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దగామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు అన్ని డివిజన్ల లో రహదారులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, వంటి అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించామన్నారు. రూ. 9.40 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 9వ డివిజన్లో భగీరథ ఆలయం నుంచి మూడుగుళ్ల సెంటర్ వరకు సిసి రోడ్ల నిర్మాణం,11 డివిజన్లో రజక కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన,పదో డివిజన్ లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 13వ డివిజన్లో హాబీబియా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, 14వ డివిజన్ ఏటిమొగ తూర్పు పేటలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి,17వ డివిజన్ లో నూతన సచివాలయ భవన నిర్మాణానికి, 23వ డివిజన్ ముగ్గుపేటలో స్మశాన వాటిక మరమ్మతు పనులను ప్రారంభించారు. 24వ డివిజన్ బాపూజీ నగర్,ముగ్గుపేట ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ మరమ్మతు పనులను శంకుస్థాపన చేశారు. 39వ డివిజన్ లో కింతాడ వెంకటరావు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసామన్నారు. ప్రధానంగా సుమారు 30 వేల మంది ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వీరందరికీ 2026 డిసెంబర్ నాటికల్లా గృహ నిర్మాణాలు కూడా పూర్తి చేసి సొంతింటి కల సహకారం చేస్తామన్నారు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు . ఆయన వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, స్మార్ట్ సిటీ ఎస్ఈ పి.వెంకటరావు, ఈఈ మాధవి, ఏఈ వై. నాగేశ్వరరావు,జే సి ఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, జిల్లా ఒక బోర్డు అధ్యక్షుడు రెహ్మాన్ ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాష,నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలిద్ బిన్ వలి , ఆయా డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️