ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది : కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ : గత ప్రభుత్వంలా కాకుండా, కూటమి సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక బకాయలు త్వరలో చెల్లిస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్‌ అన్నారు. కాకినాడలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు రాష్ట్ర యుటిఎఫ్‌ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉదయ శ్రీనివాస్‌ మాట్లాడుతూ … ఉపాధ్యాయుల బకాయిల విషయం తాను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. జల జీవన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే, గత ప్రభుత్వం వాటిని సక్రమంగా ఖర్చుపెట్టి వినియోగించలేక పోయిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ వచ్చిన తర్వాత పరిశ్రమలు, రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. భవిష్యత్తులో అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పరిశ్రమలు రానున్నాయని ఆయన చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంలో యూటీఎఫ్‌ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. యుటిఎస్‌ స్వర్ణోత్సవాలు లాంటి ఉపాధ్యాయ పండుగలు జరగటం ఈ సమాజానికి ఎంతో అవసరమన్నారు. కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ మాట్లాడుతూ … సమస్యలు అధికారుల దృష్టికి నివేదిస్తూ విద్యాభివృద్ధికి నిరంతరం కృషిచేసే తత్వం యుటిఎఫ్‌ ప్రత్యేకతని పేర్కొన్నారు. యుటిఎఫ్‌ నిబద్ధతతో పనిచేసే ఒక్కటి ఉపాధ్యాయ సంఘమని ఆయన అభినందించారు. స్వర్ణోత్సవాలు జరుగుతున్న కాకినాడ పిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వీబీ తిరుపాణ్యం మాట్లాడుతూ కళాశాల ప్రాసస్త్యాన్ని వివరించారు. 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ కళాశాలని చెప్పారు. ఇందులో చదువుకున్న విద్యార్థులు 67 దేశాల్లో వివిధ ఉన్నతశ్రేణుల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మున్సిపల్‌, మోడల్‌, పంచాయతీరాజ్‌, కస్తూరిబా పాఠశాలు ఇలా రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్‌ పాఠశాలలు ఓకే విద్యా గొడుగు కిందకు తెచ్చేందుకు యుటిఎఫ్‌ కఅషి చేస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన బకాయిల కోసం యుటిఎఫ్‌ కార్యచరణ తీసుకుందని చెప్పారు. ఫిబ్రవరి 17 నుంచి కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. దీనికోసం ఫిబ్రవరి 2న విజయవాడలో ఒక సమయాత్తక సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తర్వాత ఉత్తరాంధ్ర, గోదావరి, ద్వారా ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమిక పాఠశాలలో ఉండాలని, అవసరమైతే ఎల్కేజీ యూకేజీలను కూడా వీటిలో నిర్వహించాలని యుటిఎఫ్‌ పక్షాన తీర్మానించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో జరగాలని తీర్మానంలో పేర్కొన్నారు. హైస్కూల్లో రెండు మీడియంలలో బోధన కొనసాగించాలన్నారు.జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి. గిరిధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, సాంకేతిక స్పృహ పెంపొందించాలన్నారు. అనంతరం రాష్ట్రంలో 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో జిల్లాల వారీగా విశ్లేషణ జరిపి చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. భవిష్యత్‌ కార్యాచరణను, కర్తవ్యాలను రూపొందించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాకినాడ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. నగేష్‌, టి.చక్రవర్తి మాట్లాడుతూ నాలుగు రోజులు అప్రతిహతంగా జరిగిన స్వర్ణోత్సవాలకి సహకరించిన ప్రజాసంఘాలకు, వివిధ శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఉపాధ్యాయులందరికీ కఅతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ప్రసాదరావు, చిలుకూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
యుటిఎఫ్‌ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక బుధవారం సీనియర్‌ నాయకులు జి .ప్రభాకర్‌ వర్మ ఎన్నికల అధికారిగా ఏకగ్రీవంగా
జరిగింది. రాష్ట్ర యుటిఎఫ్‌ గౌరవ అధ్యక్షులుగా కే శ్రీనివాసరావు, అధ్యక్షులుగా ఎన్‌ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కే.సురేష్‌ కుమార్‌, ఏఎన్‌ కుసుమకుమారి, ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, కోశాధికారిగా ఆర్‌ మోహన్‌ రావు, 15 మంది రాష్ట్ర కార్యదర్శులతో నూతన కమిటీ ఏర్పడింది. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ గా టిఎస్‌ఎన్‌ఎల్‌ మల్లేశ్వరరావు, ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా కే .సురేష్‌ కుమార్‌, ప్రచురణాల కమిటీ చైర్మన్‌ గా యం. హనుమంతరావు, కుటుంబ సంక్షేమ పథకం అధ్యక్షులుగా కే. శ్రీనివాసరావు, అధ్యయన కమిటీ అధ్యక్షులుగా పి.బాబు రెడ్డితో పలు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి నూతన కార్యవర్గం కఅషి చేస్తుందని పిలుపునిచ్చారు. స్వర్ణోత్సవ మహాసభలు ఘనంగా నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి కార్యకర్తలను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో సభ్యత్వం జనరల్‌ ఫండ్‌ అధికంగా వసూలు చేసిన శాఖలకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సభలో పలు కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. నాలుగు రోజులుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన ఉపాధ్యాయ బృందాలకు బహుమతులు అందించారు.

➡️