ఎపి భవిష్యత్తు కోసమే షరతులు లేకుండా పొత్తు

Mar 31,2024 21:24
వైసిపి కీచక పాలన నుంచి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం

వైసిపి కీచక పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకే ఎలాంటి షరతులు లేకుండా పొత్తుకు వెళ్లామని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ఆదివారం పిఠాపురంలో కూటమి నేతల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. టిడిపి పిఠాపురం నియోజక వర్గ ఇన్‌ఛార్జి ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ, కాకినాడ లోక్‌ సభ అభ్యర్థి తంగెళ్ల ఉదరుశ్రీనివాస్‌, పిఠాపురం నియోజక వర్గం బిజెపి ఇన్‌ఛార్జి బి.కృష్ణంరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. బిజెపి పెద్దలు ఎక్కువ ఎంపీ స్థానాలు కావాలని కోరారన్నారు. దీంతో రెండు ఎంపీ స్థానాలకే పరిమితమయ్యామన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. మొదట్లోనే 70 నుంచి 80 శాతం మంది అంగీకరించడంతోనే పొత్తుకు వెళ్లామన్నారు. ప్రస్తుతం జనసేన బలం పెరిగిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పొత్తులకు మనమే చొరవచూపామన్నారు. బిజెపి, టిడిపి వంటి బలమైన పునాదులు, సమూహాన్ని క్రమిశిక్షణతో నడిపించే మెకానిజం జనసేన పార్టీ ఇంకా సంపాదించలేదని చెప్పారు.చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధేసిందినాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన టిడిపి అధినేత చంద్రబాబుని అకారణంగా జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డానని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అందుకే జైల్లో చంద్రబాబుని కలిసిన తరువాత తన వంతుగా ఏదైనా చేయాలి అనుకున్నానని తెలిపారు. అప్పుడే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించానన్నారు. నాడు ఆశించినట్లుగానే బిజెపి కూడా పొత్తులోకి రావడం ఆనందం కలిగించిందన్నారు. అందరం కలిసి వైసిపి పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో తన గెలుపు బాధ్యత తీసుకున్న వర్మకు కృతజ్ఞతలు తెలిపారు., గెలిచిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆయన మర్యాద తగ్గకుండా, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. కూటమి తరుపున ఎంపీగా పోటీ చేస్తున్న ఉదరు శ్రీనివాస్‌కు సహకారాన్ని అందించాలని కోరారు.పింఛన్లు అందరికీ అందేలా కషి చేద్దాంఎన్నికల కోడ్‌ వల్ల పింఛన్లు ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేద్దామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా నిలిచిపోదు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు.

➡️