కేంద్ర పథకాల చేరువకే వికసిత్‌ భారత్

Feb 11,2024 22:12
కేంద్ర పథకాల చేరువకే వికసిత్‌ భారత్

ప్రజాశక్తి-కాకినాడకేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు, బలహీన వర్గాలకు చేరువ కావాలనే లక్ష్యంతోనే వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర సదస్సులు నిర్వహిస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అన్నారు. స్థానిక రాగంపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఆదివారం వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు చేసి పథకాలపై అవగాహన కల్పించారు. ఆయా పథకాలకు అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానాలపై ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కేంద్ర పథకాలకు సంబంధించిన క్యాలెండర్‌ను కమిషనర్‌ ఆవిష్కరించారు. అభివృద్ధికి పునరుంకితమవుతామని అక్కడికి వచ్చిన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మొబైల్‌ వాహనం ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి భారత్‌ అగ్రస్థానంలో నిలవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనలో అన్ని వర్గాల ప్రజలూ భాగస్వాములు కావాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్‌ఒ మానే కృష్ణమోహన్‌, మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ డేగల వెంకటరాజు, ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు.

➡️