పది, ఇంటర్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 9,2024 22:34
పది, ఇంటర్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

ప్రజాశక్తి-కాకినాడ పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలో పది, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలతో పాటు ఎపి ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ కృతికా శుక్లా,రవెన్యూ, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ, పోస్టల్‌, జిల్లా పరిషత్‌, పోలీస్‌, రవాణా, విద్యుత్‌, వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ, పంచాయతీ, మునిసిపల్‌ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాలు, పరీక్ష పత్రాల స్టోరేజ్‌ పాయింట్లు, పోలీస్‌ బందోబస్తు, ఆర్‌టీసీ బస్సుల ఏర్పాటు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులతో చర్చించారు. కలెక్టర్‌ కతికా శుక్లా మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి మొదటి, ద్వితీయ జనరల్‌ విద్యార్థులతో పాటు ఒకేషనల్‌ విద్యార్థులకు మార్చి 01వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో 44,179 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెగ్యులర్‌ ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షలతో పాటు ఓపెన్‌ (ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియెట్‌) పరీక్షలు జరగనున్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరిగే రెగ్యులర్‌ పదో తరగతి పరీక్షలు మార్చ్‌ -2024కు సంబంధించి జిల్లాలో 137 పరీక్షా కేంద్రాల్లో 32,230 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్‌ ఓపెన్‌ (ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌) పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు. వీటికి 8,751 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వివరించారు. స్టోరేజ్‌ కేంద్రాల నుంచి పరీక్ష పత్రాలను సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేర్చడం దగ్గర నుండి జవాబు పత్రాలను తిరిగి పోస్ట్‌ ఆఫీస్‌కు పంపేవరకు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా ఫర్నిచర్‌, తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని వైద్య ఆరోగ్యం, పంచాయితీ శాఖల అధికారులను ఆదేశించారు. 144 సెక్షన్‌ అమలు, బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యల విషయంలో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

➡️