పవన్‌ ప్రభావితం చేయగలరా..?

Apr 1,2024 23:24
జనసేన అధినేత పవన్‌

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దీష్టి అంతా పిఠాపురంపైనే ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఎంచుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పట్టు కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈసారి టిడిపి నేత ఎస్‌విఎస్‌ఎస్‌.వర్మ ఆయనకు ప్రధాన అడ్డంకి అవుతారని అభిప్రాయం వినిపించింది. దానిని తొలగించుకునేందుకు ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ దృష్టి పెట్టారు. వర్మను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. పిఠాపురంలో నాలుగు రోజులు పర్యటన పేరుతో ఇక్కడికి చేరగానే తొలుత వర్మ ఇంటికి వెళ్లారు. సుమారు గంట పాటు ఏకాంతంగా కీలక అంశాలపై చర్చ జరిపారు. వర్మ తల్లి కాళ్ళకు వందనం చేసి వచ్చారు. ఆ తర్వాత చేబ్రోలు సభలో ఆయన మాట్లాడారు. అయితే సభ నిర్వహణ తీరు జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని కల్పించింది. పవన్‌కళ్యాణ్‌ ఆశించినంత జనం రాకపోవడం, వచ్చిన జనం కూడా సభ ఆలస్యం కావడంతో వెనక్కి వెళ్లిపోవడంతో శ్రేణులను నిరుత్సాహ పరిచింది. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం కూడా పెద్దగా ఆకట్టుకునే రీతిలో లేదని అభిప్రాయం వినిపించింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలతోపాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయన నుంచి అభిమానులు ఘాటైన విమర్శలు ఆశించారు. కానీ పవన్‌కళ్యాణ్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. గతానికి భిన్నంగా ప్రసంగం సాగింది. దీంతో పార్టీ శ్రేణులు పెద్దగా సంతృప్తి పడలేదని అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తం అయ్యాఇ. అదే సమయంలో వచ్చిన కార్యకర్తల్లో కూడా తొక్కిసలాట జరగడంతో కొంతమంది గాయపడ్డారు. ఒకరికి కాలు విరిగింది. గాయపడిన కార్యకర్తల విషయంలోనూ జనసేన శ్రద్ధ చూపలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.అయితే పవన్‌ కళ్యాణ్‌ రెండో రోజు ఆలయాల సందర్శన, ఆ తర్వాత టిడిపి, బిజెపి శ్రేణులతో కలిసి నిర్వహించిన సభలో తన గెలుపు బాధ్యత పూర్తిగా వర్మదే అన్నట్లుగా మాట్లాడడం ఆశక్తికరంగా మారింది. ‘నా గెలుపు మీ చేతుల్లో పెట్టాను’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ వర్మ చేతిలో చేయి వేసి మరీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం నా ఒక్కడి విజయం మాత్రమే కాదు వర్మ విజయం, కూటమి విజయం, మనందరి సమిష్టి విజయం అంటూ చెప్పారు. ఇలా మొత్తంగా పూర్తిగా వర్మపైనే తన గెలుపు భారాన్ని వేసి పవన్‌ కళ్యాణ్‌ ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందోనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వర్మకు సహజంగా కాపుల్లో చాలా వ్యతిరేకత ఉంది. కాపు నేతలే గతంలో ఎంఎల్‌ఎగా వద్దంటూ వర్మను వ్యతిరేకించారు. అయితే ఆయనకు బిసిల్లో మంచి పట్టు ఉందన్న అభిప్రాయం జనసేనాని మనసులో ఉంది. దానికి తగ్గట్టుగానే కాపు ఓట్లు తనను చూసి వేసినప్పటికీ బిసి ఓట్లు సమీకరించాలంటే వర్మ మద్దతు తనకు అత్యవసరమని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వర్మను ప్రసన్నం చేసుకునేదుకు ఆయన పెద్ద స్థాయిలోనే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వర్మను పవన్‌ కళ్యాణ్‌ బౌన్సర్లు బస చేసిన హోటల్‌ గేటు వద్ద నెట్టేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. దానిపై టిడిపి శ్రేణులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. వర్మను కూడా నెట్టేసే పరిస్థితులు రావడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది వర్మ, జనసేనాని కలిసి పిఠాపురంలో జనసేన జెండా ఎగరడానికి ఏ విధంగా కృషి చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు అనూహ్యంగా పవన్‌ కళ్యాణ్‌ రెండో రోజుకే తన పర్యటనను వాయిదా వేయడం కీలక పరిణామంగా కనిపిస్తుంది. ఆయన నాలుగు రోజులపాటు పిఠాపురంలోనే ఉండేందుకు పూర్తిస్థాయి షెడ్యూల్‌ ఖరారు చేశారు. మొదటిరోజు చేబ్రోలు బహిరంగ సభ, రెండో రోజు ఆత్మీయ సమావేశం, మూడో రోజు బూత్‌ కమిటీ నాయకులతో సమావేశం, నాలుగో రోజు నియోజకవర్గానికి చెందిన నాయకులతో ఆయన మాట్లాడి పార్టీకి దిశ నిర్దేశం చేయాల్సి ఉంది. దానికి భిన్నంగా తనకు అనారోగ్య సమస్య పేరుతో పవన్‌ కళ్యాణ్‌ అనూహ్యంగా వెనుతిరగడం జనసేన శ్రేణులను సైతం ఆశ్చర్యపడేలా చేసింది. ఆయన 4 రోజులు పర్యటన పేరుతో ముందుగా షెడ్యూల్‌ ఖరారు చేసుకుని ఒకరోజు తర్వాత రెండో రోజుకే మధ్యాహ్నం తర్వాత వెనుదిరికి వెళ్లిపోవడం పట్ల అందరూ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఆయనకు గొంతు నొప్పి ఉండడంతో వెళ్లాల్సి వచ్చిందని అందుకే హైదరాబాద్‌ పయనమయ్యారని చెబుతున్నప్పటికీ విమర్శకులు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదిలావుండగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మళ్ళీ పిఠాపురం వచ్చారు. స్థానికంగా ఉన్న కొంతమందికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురానికి ఎన్నికలకు ముందే సరైన సమయాన్ని కేటాయించకపోతే ఎన్నికల తర్వాత పిఠాపురం వైపు చూస్తారా? లేదా? అనే ప్రశ్నలు ప్రత్యర్థుల నుంచి ప్రారంభం అయ్యాయి. ఎంపీ వంగా గీత లాంటి వారు కూడా ఇదే రీతిలో విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ రీ షెడ్యూల్‌ చేసుకుని పూర్తిస్థాయిలో మూడు మండలాల్లోనూ ఏ మేరకు పర్యటిస్తారు? ఎన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు? ఓటర్లను ఏ రకంగా ప్రసన్నం చేసుకుంటారు? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల అభిమానాన్ని ఆయనకు అనుకూలంగా మార్చడంలో వర్మ ఏ మేరకు కృషి చేసి, సహకరిస్తారన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది.

➡️