బియ్యం అక్రమ రవాణా

Feb 12,2024 23:25
గత నెల 8న కాజులూరు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

గత నెల 8న కాజులూరు మండలం ఆర్యావటంలో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 సంచుల్లో రూ.82 వేలు విలువైన సుమారు 1807 కేజీలు, జగ్గంపేట మండలం రాజపూడిలో రెండు ఇళ్లల్లో రూ.87 వేలు విలువైన 25 సంచుల్లో 920 కేజీల పిడిఎస్‌ బియ్యాన్ని రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై 6-ఏ క్రింద కేసు నమోదు చేశారు. ఇలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల రేషన్‌ బియ్యం పట్టుబడుతున్నా సంబంధిత మాఫియా ఆగడాలు ఆగడం లేదు.

పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కాకినాడ పోర్ట్‌ ద్వారా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. రూ.కోట్లు సంపాదనే లక్ష్యంగా కొందరు అధికారుల పరోక్ష సహకారంతో మాఫియా పెద్దలు వివిధ జిల్లాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయించి కొన్ని అనుకూల ప్రాంతాల్లో నిల్వ ఉంచి ప్రతినెలా టన్నుల కొద్దీ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా రూ.కోట్లు విలువచేసే టన్నుల కొద్దీ బియ్యాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. పేదలను మభ్యపెట్టిప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 8 వరకు ఎండియు వాహనాల ద్వారా రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా కిలో బియ్యం రూపాయికే పంపిణీ చేస్తుండగా కొందరు ప్రయివేటు వ్యక్తులు పేదలను మభ్యపెట్టి వాటిని తరలించకపోతున్నారు. కిలో బియ్యం రూ.15 నుంచి 20 ఇస్తామని మభ్యపెడున్నారు. విడివిడిగా కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా నిల్వ చేసి ఒకేసారి బస్తాలుగా మార్చి బడా మాఫియా పెద్దలకు విక్రయిస్తున్నారు. ఇలా పేదల నుంచి సేకరించిన బియ్యాన్ని కొన్ని రైస్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం.కేసులు నమోదు చేస్తున్న ఆగని దందారీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేసి అక్రమ నిల్వలను, పిడిఎఫ్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా రేషన్‌ మాఫియా ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఈనెల 8న జగ్గంపేటలో రూ.11.47 లక్షల విలువైన 5,450 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్‌ చేశారు. ఈనెల 9న డా బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మార్కెట్‌ వీధిలో రూ.54 వేలు విలువైన 1200 కేజీల పిడిఎస్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతనెల 5న ఏలేశ్వరంలో రూ.94 వేలు విలువైన సుమారు 2 వేలు కిలోలు, గతేడాది డిసెంబర్‌ 11న యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో రూ.80 వేలు విలువైన సుమారు వెయ్యి కిలోల పిడిఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌ 10న కిర్లంపూడి మండలం గోనేడలో కొనుగోలు చేసి ఒక వ్యానులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.4.70 లక్షల విలువైన 3140 కేజీల పిడిఎస్‌ బియ్యాన్ని జగ్గంపేటలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. ఇదే నెల 6న కాకినాడ సంజరు కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3.61 లక్షల విలువైన 2670 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేశారు.

➡️