104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి

Oct 27,2024 21:57
104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి

ప్రజాశక్తి-కాకినాడ రెండు నెలల బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని, మూడేళ్ల నుండి నిలుపుదల చేసిన ఇంక్రిమెంట్లు విడుదల చేయాలని, 104 అంబులెన్సులను ప్రభుత్వమే నిర్వహించాలని 104 ఉద్యోగుల విస్తత సమావేశం డిమాండ్‌ చేసింది. స్థానిక కచేరిపేట సిఐటియు కార్యాలయంలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా సమావేశం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ త్రిమూర్తులు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పసుపులేటి శ్రీకాంత్‌, నాయకులు హరిప్రసాద్‌ మాట్లాడారు. నెలల తరబడి వేతనాలు బకాయి పెడితే ఎలా బతకాలని ప్రశ్నించారు. సంవత్సరానికి 10 శాతం ఇంక్రిమెంట్‌ చెల్లిస్తామని ఎంఒయు నిబంధనలు ఉన్నా, 3 ఏళ్ల నుండి ఒక రూపాయి వేతనం కూడా చెల్లించకపోవడం అన్యాయమన్నారు. తక్షణం బకాయి పెట్టిన మూడేళ్ల ఇంక్రిమెంటు ప్రతి ఉద్యోగికి 30 శాతం చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 104 వ్యవస్థను కాపాడుకునేందుకు దశలవారీ పోరాటాలకు ఉద్యోగులందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె.వెంకటరావు, ఉపాధ్యక్షురాలు ఆర్‌.ఇందుమతి, కోశాధికారి సిహెచ్‌.శ్రీనివాస్‌, ఎం.సతీష్‌, జి.పాపారావు, వీరభద్రరావు, డిఇఒ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️