ప్రజాశక్తి-ఏలేశ్వరం మండలంలోని అవంతి ప్రోజన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఆహారం కలుషితమై 35 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సమీపంలోని ఏలేశ్వరం ఆసుపత్రికి కాక జగ్గంపేటలోని శ్రీరామచంద్ర హాస్పిటల్‌కు తరలించి గోప్యంగా వైద్యం చేయిస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న 30 మందితో పాటు ఐదుగురు క్యాంటీన్ సిబ్బంది గత శుక్రవారం రాత్రి విరోచనాలు, వాంతులతో అనారోగ్యం పాలయ్యారు. ఆ నోటా ఈ నోట పెద్ద ఎత్తున కార్మికులు అస్వస్థత పాలయ్యారని తెలుసుకున్న విలేకరులు వివరాల కోసం సోమవారం ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళగా లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే జగ్గంపేటలో కార్మికులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనికి సైతం విలేకరులను అనుమతించ లేదు. ఈ విషయాన్ని విలేకరులు జిల్లా వైద్యాధికారులకు తెలపడంతో డిఎంహెచ్‌ఒ నరసింహ నాయక్, జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి జి.శ్రీనివాసరావు జగ్గంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కార్మికులు శుక్రవారం ఉదయం చట్నీతో ఇడ్లీ, మధ్యాహ్నం గుత్తి వంకాయ కూర, రాత్రి దోసకాయ కూరతో భోజనం చేశారన్నారు. శుక్రవారం రాత్రి అస్వస్థత గురికావడంతో ఆస్పత్రిలో చేరగా చికిత్స పొంది కొంతమంది ఇంటికి వెళ్లి పోగా ఇంకా 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఫ్యాక్టరీ, కిచెన్ లైసెన్సులు పొంది ఉన్నందున శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించి తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, కూటమి నాయకులు బస ప్రసాద్, మైరాల కనకారావు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
