ప్రజాశక్తి – కాకినాడ
ఆశాలను 4వ రతగతి ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం స్థానిక అంబేద్కర్‌ర్ భవన్లో ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. తొలుత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, నాయకులు మలకా నాగలక్ష్మీ, ఎం.లక్ష్మీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఆశాలకు అధిక వేతనం చెల్లిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అసత్యాలను ప్రసారం చేస్తుందని విమర్శించారు. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే ఆశా కార్యకర్తలకు అధిక వేతనం చెల్లిస్తు న్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్‌హెచ్‌ఎం ను సంస్తాగతం చేసి ఆశా కార్యకర్తలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌ఎం లక్ష్యాలను పూర్తిచేయడంలో ఆశాల కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో ఆశాలకు సంబంధం లేని అనేక ఇతర పనులను అప్పగించి పనిభారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ఆశాలకు రూ.21వేలు వేతనం చెల్లిస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకుని అలాంటి ఉద్దేశ్యం లేదని రెండవ రోజే మాట మార్చడం బిజెపి రాజకీయ దివాళాకోరు విధానాన్ని స్పష్టం చేసిందన్నారు. పెన్షన్ ప్రకటించిన తర్వాతే ఆశా కార్యకర్తలను రిటైర్మెంట్ చేయాలని, ఆశా కార్యకర్తలకు స్కూటర్లు అందించాలని, ప్రతి పిహెచ్‌సిలో వెయిటింగ్ హాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మ, రాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఆఫీస్ బేరర్స్ ఆశాజ్యోతి, ఎం.లలిత, ఎ.పద్మావతి, కె.మరియారత్నం, కె.గంగాభవాని, ఎం.బేబి, వి.ఉమావతి, ఎం.భారతి, రమణమ్మ, లోవకుమారి, చెక్కల వేణి తదితరులు పాల్గొన్నారు.