ప్రజాశక్తి – పెద్దాపురం, సామర్లకోట
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు తీసుకువచ్చిన యాప్‌లన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సామర్లకోట రూరల్ మండల యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్దాపురం ఐసిడిఎస్ సిడిపిఒ ఉషను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రికార్డు వర్క్ తగ్గించాలని, 7 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వివిధ యాప్‌ల్లో నమోదు చేయడం వల్ల అంగన్‌వాడీలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. కావున యాప్‌లన్నీ కలిపి ఒకే యాప్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదని, కొత్తగా 7 నెలల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలకు ఫోటోలు తీసి ఆహారం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. సిడిపిఒను కలిసిన వారిలో యూనియన్ నాయకులు వి.ఎస్తేరురాణి, జి. మహాలక్ష్మి, ఎస్.స్నేహాలత, పివి.పద్మావతి పాల్గొన్నారు.